Punjab Kings Head Coach Bayliss: పంజాబ్ కింగ్స్ కోచ్‌గా కుంబ్లే ఔట్.. కొత్త కోచ్ బేలిస్
16 September 2022, 15:19 IST
Punjab Kings Head Coach Bayliss: పంజాబ్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్‌గా ట్రెవర్ బేలిస్‌ను నియమించారు. ఇన్నాళ్లూ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే కాంట్రాక్ట్‌ను ఆ టీమ్ పొడిగించలేదు.
ట్రెవర్ బేలిస్
Punjab Kings Head Coach Bayliss: ఐపీఎల్‌లో మొదటి నుంచీ ఉన్నా ఇప్పటి వరకూ టైటిల్ గెలవలేకపోయిన పంజాబ్ కింగ్స్ టీమ్ తాజాగా మరోసారి హెడ్ కోచ్‌ను మార్చింది. ఇన్నాళ్లూ కోచ్‌గా ఉన్న అనిల్ కుంబ్లే స్థానంలో ట్రెవర్ బేలిస్‌ను నియమించింది. అనిల్ కుంబ్లే కోచింగ్‌లో పంజాబ్ కింగ్స్ విఫలం కావడంతో ఆ టీమ్ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించలేదు.
శుక్రవారం (సెప్టెంబర్ 16) ట్రెవర్ బేలిస్‌ను హెడ్‌కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఐపీఎల్ 2023 సీజన్ నుంచి బేలిస్ పంజాబ్ కింగ్స్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తనకు ఈ కోచ్ పదవి దక్కడంపై బేలిస్ స్పందించాడు. తాను ఎంతో గౌరవంగా ఫీలవుతున్నట్లు చెప్పాడు. "పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ పదవి దక్కడం గౌరవంగా భావిస్తున్నాను. సక్సెస్ కోసం ఆరాటపడే ఫ్రాంచైజీ ఇది. ఎంతో నైపుణ్యం ఉన్న ప్లేయర్స్‌తో కలిసి పని చేయడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని బేలిస్ ఒక ప్రకటనలో చెప్పాడు.
ట్రెవర్ బేలిస్‌కు కోచ్‌గా మంచి సక్సెస్ ఉంది. 2019లో ఇంగ్లండ్ 50 ఓవర్ల వరల్డ్‌కప్ గెలిచినప్పుడు బేలిసే కోచ్‌గా ఉన్నాడు. ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్ కోచ్‌గా 2012, 2014లలో ఐపీఎల్ టైటిల్ సాధించాడు. ఇక బిగ్ బాష్ లీగ్‌లో 2014లో బేలిస్ కోచింగ్‌లోనే సిడ్నీ సిక్సర్స్ విజేతగా నిలిచింది. రీసెంట్‌గా 2020, 2021 సీజన్‌లలోనూ బేలిస్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్‌గా పని చేశాడు.
2008లో ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ పంజాబ్ ఫ్రాంచైజీ లీగ్‌లో ఉంది. మొదట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్‌గా ఉన్న పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చారు. అయితే ఇప్పటి వరకూ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. అనిల్ కుంబ్లే హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లేఆఫ్స్ చేరలేకపోయింది. మరి కోచ్‌గా ఎంతో సక్సెస్ ఉన్న బేలిస్.. పంజాబ్ రాతను మారుస్తాడేమో చూడాలి.
అటు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కూడా తమ హెడ్ కోచ్ ను మార్చిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లూ కోచ్ గా ఉన్న జయవర్దనెకు తమ సెంట్రల్ టీమ్ లో గ్లోబల్ పొజిషన్ ఇవ్వడంతో.. అతని స్థానంలో సౌతాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ కు ఆ బాధ్యతలు అప్పగించారు.
టాపిక్