IPL Window: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఇక నుంచి రెండున్నర నెలలు
IPL Window: ఐపీఎల్ ఇక నుంచి మరిన్ని రోజుల పాటు ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఐపీఎల్ విండోను ఐసీసీ మరింత పెంచినట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా వెల్లడించారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లవర్స్‌కు ఇది నిజంగా గుడ్‌న్యూసే. ఇక నుంచి ఈ మెగా లీగ్‌కు 10 వారాల విండో ఇవ్వడానికి ఐసీసీ అంగీకరించినట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా చెప్పారు. రాయ్‌టర్స్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడిన జే షా.. మరింత మంది ఇంటర్నేషనల్ టాప్ క్రికెటర్లు ఈ లీగ్‌లో పాల్గొనే అవకాశం దీనివల్ల కలుగుతుందని అన్నారు.
అయితే ఇప్పటికిప్పుడు ఈ లీగ్‌లో కొత్త ఫ్రాంఛైజీలను తీసుకొచ్చే ఆలోచనేదీ లేదని స్పష్టం చేశారు. "ఈ విషయంపై ఐసీసీతోపాటు ఇతర క్రికెట్ బోర్డులతో మాట్లాడుతున్నాం. వచ్చే ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో ఐపీఎల్‌కు రెండున్నర నెలల విండో దక్కుతుందని నేను కచ్చితంగా చెప్పగలను" అని జే షా తెలిపారు. ఈ లీగ్ అందరికీ లబ్ధి చేకూర్చేది కాబట్టి.. ఐసీసీతోపాటు ఇతర బోర్డుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఐపీఎల్ ఫ్రాంఛైజీల సంఖ్య పదికి చేరడంతో రెండు నెలల పాటు ఈ మెగా లీగ్ జరిగింది. ఐపీఎల్ జరిగే సమయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ దాదాపు నిలిచిపోతుంది. ప్రస్తుతం ఇందులో 74 మ్యాచ్‌లు జరుగుతున్నా.. 2027 నుంచి 94 మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఐసీసీ 2024-2031 వరకూ తమ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌పై చర్చించేందుకు వచ్చే వారం సమావేశం కానుంది.
ఈ మధ్యే మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐకి రూ.48,390 కోట్ల భారీ మొత్తం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో లీగ్‌పై ఐసీసీ కూడా ఆసక్తి చూపుతోంది. ఇది తమ మీడియా హక్కుల డిమాండ్‌ను కూడా పెంచుతుందని ఐసీసీ భావిస్తోంది. అయితే ఐపీఎల్ విండోను పెంచడం వల్ల ఇండియా ఇంటర్నేషనల్ క్రికెట్ గాడి తప్పుతుందన్న వాదనలు జే షా తోసి పుచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌కు బీసీసీఐ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్