Pak vs Eng: 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ టీమ్‌-pak vs eng series to start soon as england team arrive in pakistan after 17 years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pak Vs Eng Series To Start Soon As England Team Arrive In Pakistan After 17 Years

Pak vs Eng: 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ టీమ్‌

Hari Prasad S HT Telugu
Sep 15, 2022 05:03 PM IST

Pak vs Eng: 17 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌. ఏకంగా ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఆ టీమ్‌ గురువారం (సెప్టెంబర్‌ 15) కరాచీలో ల్యాండైంది.

కరాచీలోని హోటల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, సామ్ కరన్, మొయిన్ అలీ
కరాచీలోని హోటల్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్, సామ్ కరన్, మొయిన్ అలీ (Twitter)

Pak vs Eng: టీ20 వరల్డ్‌కప్‌కు ముందు మరో ఇంట్రెస్టింగ్‌ టీ20 సిరీస్‌కు టైమ్‌ దగ్గర పడింది. పాకిస్థాన్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ 17 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ దేశంలో అడుగుపెట్టింది. 19 మంది సభ్యుల ఇంగ్లండ్‌ టీమ్‌ గురువారం కరాచీ ఎయిర్‌పోర్ట్‌లో దిగింది. టీ20 వరల్డ్‌కప్‌కు ముందు ఇంగ్లండ్‌ ఆడబోయే చివరి టీ20 సిరీస్‌ ఇదే.

ట్రెండింగ్ వార్తలు

చార్టర్డ్‌ ప్లేన్‌లో కరాచీ వచ్చిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ అండ్‌ టీమ్‌కు పాక్‌ క్రికెట్‌ బోర్డు తరఫున స్వాగతం పలికారు. పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య ఏడు టీ20లు కరాచీ, లాహోర్‌లలో జరగనున్నాయి. ఇంగ్లండ్‌ టీమ్‌ పాక్‌ గడ్డపై అడుగుపెట్టిన వీడియోను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. సుమారు రెండు నిమిషాల వీడియోను పోస్ట్‌ చేసింది.

ఇందులో ఇంగ్లండ్‌ టీమ్‌ ప్లేన్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌లో దిగడం, ఆ తర్వాత హోటల్‌కు వెళ్లడానికి వ్యాన్‌లోకి ఎక్కుతుండటం, తర్వాత హోటల్‌లో ఇంగ్లిష్‌ ప్లేయర్స్‌ సరదాగా గడపడం చూడొచ్చు. పూర్తిస్థాయి ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌ 2005లో చివరిగా పాకిస్థాన్‌ టూర్‌కు వచ్చింది. ఆ తర్వాత 2009లో శ్రీలంక టీమ్‌పై ఉగ్రవాదుల దాడితో చాలా ఏళ్లపాటు పాక్‌లో క్రికెట్‌ సిరీస్‌లు జరగలేదు.

ఈ గ్యాప్‌లో పలువురు ఇంగ్లండ్‌ టీమ్‌ ప్లేయర్స్‌ పాకిస్థాన్‌లో కొన్ని ఎగ్జిబిషన్‌ టీ20 మ్యాచ్‌లు ఆడటంతోపాటు పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ కనిపించారు. అయితే పూర్తి టీమ్‌ ఓ సిరీస్‌ కోసం పాకిస్థాన్‌ రావడం మాత్రం 2005 తర్వాత ఇదే తొలిసారి. ఇంగ్లండ్‌ టీమ్ రాక సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ టీమ్‌ ప్లేయర్స్‌ వెళ్లే బస్సు చుట్టూ సెక్యూరిటీ చాలా పటిష్ఠంగా ఉంది.

సెప్టెంబర్‌ 25 వరకూ ఇంగ్లండ్‌ టీమ్‌ కరాచీలోనే ఉండనుంది. గతేడాదే పాకిస్థాన్‌లో ఇంగ్లండ్‌ టీమ్‌ పర్యటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో సెక్యూరిటీ కారణాలు చెబుతూ రద్దు చేసుకుంది. ఆ సమయంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఈ సిరీస్‌ను 2022కు వాయిదా వేశారు. ఈ టూర్‌లో ఇంగ్లండ్‌ మూడు టెస్ట్‌లు కూడా ఆడాల్సి ఉన్నా.. ఆ సిరీస్‌ కోసం డిసెంబర్‌లో మరోసారి రానుంది.

ఈ మూడు టెస్టుల సిరీస్‌ డిసెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 21 వరకూ జరుగుతుంది. రావల్పిండి, కరాచీ, ముల్తాన్‌లలో ఈ మూడు టెస్ట్‌లు జరుగుతాయి. ప్రస్తుతం ఈ ఏడు టీ20ల సిరీస్‌ సెప్టెంబర్‌ 20 నుంచి అక్టోబర్‌ 2 వరకూ జరుగుతాయి. తొలి నాలుగు టీ20లు కరాచీలో, చివరి మూడు టీ20లో లాహోర్‌లో జరగనున్నాయి.

WhatsApp channel