PCB Chief on India: పాకిస్థాన్‌కు వచ్చి ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది: పీసీబీ ఛీఫ్ షాకింగ్ కామెంట్స్
12 May 2023, 14:18 IST
- PCB Chief on India: పాకిస్థాన్‌కు వచ్చి ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉందంటూ పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆసియా కప్ విషయంలో రెండు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ
PCB Chief on India: పాకిస్థాన్‌కు వచ్చి ఓడిపోతామన్న భయం ఇండియన్ క్రికెట్ టీమ్ కు ఉందేమో అన్న సందేహం తనకు కలుగుతోందని అన్నారు పీసీబీ ఛీఫ్ నజమ్ సేఠీ. అందుకే తమ టీమ్ ను పాకిస్థాన్ కు పంపించడానికి బీసీసీఐ సిద్ధంగా లేదని ఆయన అనడం గమనార్హం. ఆసియా కప్ ను పాకిస్థాన్ నుంచి తరలించేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తుండటం పీసీబీ ఛీఫ్ కు మింగుడు పడటం లేదు.
"ఇండియన్ బ్రిడ్జ్, వాలీబాల్, కబడ్డీ టీమ్స్ పాకిస్థాన్ కు వచ్చాయి. మరి ఇండియన్ క్రికెట్ టీమ్ కు పాకిస్థాన్ రావడానికి ఉన్న సమస్య ఏంటి. నా అనుమానం ప్రకారం ఇండియాలో అయినా, పాకిస్థాన్ లో అయినా పాక్ చేతుల్లో ఓడిపోతామన్న భయం ఇండియాకు ఉంది" అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తో నజమ్ సేఠీ అన్నారు. ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరిగే అవకాశం ఉందన్న వార్తపై కూడా ఆయన స్పందించారు.
ఆ వేదిక ఎంపికలో రాజకీయ కారణాలు ఉన్నాయన్న సందేహం వ్యక్తం చేశారు. "నేను ఇది విన్నప్పుడు నాకు నేను నవ్వుకున్నాను. ఇండియాకు రాకుండా చేయడానికి ఇదొక మార్గం కావచ్చని అనుకున్నాను. చెన్నై లేదా కోల్‌కతా అని చెప్పి ఉంటే వేరేలా ఉండేది. కానీ అహ్మదాబాద్ లో పాకిస్థాన్ టీమ్ కు భద్రతాపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది" అని నజమ్ సేఠీ అన్నారు.
దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, అహ్మదాబాద్ ను ఎవరు ఏలుతున్నారో మీకు తెలుసు కదా అంటూ నజమ్ సేఠీ పొలిటికల్ కామెంట్స్ కూడా చేయడం గమనార్హం. ఇండోపాక్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వేదికను ఎంపిక చేయడం వెనుక రాజకీయ కారణం ఉందన్న విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పారు.