తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pak Vs Afg: పాకిస్థాన్‌ గెలిస్తే ఇండియా ఇంటికే

Pak vs Afg: పాకిస్థాన్‌ గెలిస్తే ఇండియా ఇంటికే

Hari Prasad S HT Telugu

07 September 2022, 15:04 IST

google News
    • Pak vs Afg: పాకిస్థాన్‌ గెలిస్తే ఇండియా ఇంటిదారి పడుతుంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో దాయాది ఓడిపోవాలని ఇండియన్‌ ఫ్యాన్స్‌ ప్రార్థనలు చేస్తున్నారు.
ఇండియా ఆశలన్నీ ఆఫ్ఘనిస్థాన్ టీమ్ పైనే
ఇండియా ఆశలన్నీ ఆఫ్ఘనిస్థాన్ టీమ్ పైనే (ANI)

ఇండియా ఆశలన్నీ ఆఫ్ఘనిస్థాన్ టీమ్ పైనే

Pak vs Afg: ఆసియాకప్‌లో బుధవారం (సెప్టెంబర్‌ 7) ఇండియా మ్యాచ్‌ లేదు. అయినా ఇండియన్‌ ఫ్యాన్స్‌ అందరూ టీవీలకు అతుక్కుపోనున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓడిపోవాలని ప్రార్థిస్తూ ఈ మ్యాచ్‌ను చూడనున్నారు. ఒక రకంగా ఆసియా కప్‌ ఫైనల్‌ బెర్త్‌ తేలిపోయేది ఈ మ్యాచ్‌తోనే. పాకిస్థాన్‌ గెలిస్తే ఆ టీమ్‌ ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఇండియాతోపాటు ఆఫ్ఘనిస్థాన్‌ కూడా ఇంటిదారి పడతాయి. అప్పుడు ఇండియా, ఆఫ్గనిస్థాన్‌.. శ్రీలంక, పాకిస్థాన్‌ మధ్య జరగబోయే మ్యాచ్‌లకు ఎలాంటి ప్రాధాన్యతా ఉండదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ గెలిస్తే మాత్రం ఇండియా ఆశలు సజీవంగా ఉండటంతోపాటు.. ఫైనల్‌ రేసు రసవత్తరంగా మారుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఓడిపోతే ఆ టీమ్‌కు చివరి మ్యాచ్‌ శ్రీలంకతో ఉంటుంది.

ఆ మ్యాచ్‌లోనూ పాక్‌ ఓడిపోయి.. ఇటు ఆఫ్ఘనిస్థాన్‌ను ఇండియా ఓడిస్తే ఫైనల్‌ చేరే టీమ్‌కు నెట్‌ రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో శ్రీలంక తన ఫైనల్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది. ఇప్పటికీ ఇండియాపై గెలిచిన పాకిస్థాన్‌.. రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘన్‌ను ఓడిస్తే ఎలాంటి డ్రామా లేకుండా ఆ టీమ్‌ ఫైనల్‌కు వెళ్లిపోతుంది.

ఒకవేళ పాక్‌ ఈ మ్యాచ్‌ ఓడిపోతే ఇండియా ఆశలు సజీవంగా ఉంటాయి. అప్పుడు ఆఫ్ఘన్‌ను తన చివరి మ్యాచ్‌లో భారీ తేడాతో ఇండియా ఓడించాల్సి ఉంటుంది. అంతేకాదు పాక్‌ తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లోనూ చిత్తుగా ఓడిపోవాలి. అప్పుడు పాక్‌, ఇండియా, ఆఫ్ఘన్‌ ఒక్కో విజయంతో ఫైనల్‌ రేసులో ఉంటాయి. మెరుగైన నెట్‌ రన్‌రేట్‌ ఉన్న టీమ్‌ ఫైనల్‌ చేరుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా ఆశలన్నీ ఆఫ్ఘనిస్థాన్‌పైనే ఉన్నాయి. లీగ్‌ స్టేజ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్‌లను ఓడించి సంచలనం సృష్టించిన ఆ టీమ్‌.. సూపర్‌ ఫోర్‌లోనూ అలాంటి మరో అద్భుతం చేయాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్‌ రెండు టీ20ల్లో తలపడగా.. రెండుసార్లూ పాకిస్థానే గెలిచింది. కానీ ఈసారి ఆఫ్ఘన్‌ టీమ్‌ కాస్త పటిష్ఠంగా కనిపిస్తోంది. దీంతో పాకిస్థాన్‌కు గెలుపు అంత సులువు కాదు.

ఆఫ్ఘన్‌ టీమ్‌లో 20 ఏళ్ల ఓపెనర్‌ రహ్మతుల్లా గుర్బాజ్‌ టాప్‌ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి తోడు హజ్రతుల్లా జజాయ్‌, ఇబ్రహీం జద్రాన్‌, రషీద్‌ ఖాన్‌, ముజీబుర్‌ రెహమాన్‌లాంటి ప్లేయర్స్‌ కూడా ఈ సిరీస్‌లో మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. దీంతో పాక్‌, ఆఫ్ఘన్‌ మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. షార్జాలో బుధవారం రాత్రి 7.30 గంటలకు ఈమ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

తదుపరి వ్యాసం