Olympics Shooting: ఒలింపిక్స్ తొలి రోజే ఇండియాకు నిరాశ.. కనీసం ఫైనల్ కూడా చేరని షూటర్లు
27 July 2024, 14:07 IST
- Olympics Shooting: పారిస్ ఒలింపిక్స్ తొలి రోజే ఇండియాకు నిరాశ ఎదురైంది. ఎంతో ఆశలు రేపుతున్న షూటింగ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ లో మన దేశానికి చెందిన నలుగురు షూటర్లు విఫలమయ్యారు.
ఒలింపిక్స్ తొలి రోజే ఇండియాకు నిరాశ.. కనీసం ఫైనల్ కూడా చేరని షూటర్లు
Olympics Shooting: ఒలింపిక్స్ తొలి రోజు ఇండియా ఒకే ఒక్క మెడల్ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉంది. అందులోనూ నిరాశ తప్పలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మన దేశానికి చెందిన రెండు టీమ్స్ ఫైనల్ చేరలేకపోయాయి. మెడల్స్ రౌండ్లకు అర్హత సాధించాలంటే టాప్ 4లో నిలవాల్సి ఉండగా.. రెండు జట్లూ విఫలమయ్యాయి.
ఫైనల్ చేరని ఇండియన్ టీమ్స్
పారిస్ ఒలింపిక్స్ తొలి రోజు షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ మెడల్ ఈవెంట్ లో ఇండియా పోటీ పడింది. అయితే క్వాలిఫికేషన్ రౌండ్లోనే ఇండియా తరఫున బరిలోకి దిగిన రెండు టీమ్స్ విఫలమయ్యాయి. ఇండియాకు చెందిన ఎలవెనిల్ వలరివన్, సందీప్ సింగ్.. రమితా జిందల్, అర్జున్ బబుతా జట్లుగా బరిలోకి దిగాయి. అయితే ఈ రెండు టీమ్స్ టాప్ 4లోకి వెళ్లలేకపోయాయి.
రమితా జిందల్, అర్జున్ బబుతా అర్హత సాధించడానికి దగ్గరగా వచ్చినా.. 628.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. కేవలం ఒకే ఒక్క పాయింట్ తో నార్వే, జర్మనీ జట్ల కంటే వెనుకబడింది. ఈ రెండు టీమ్స్ బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడనున్నాయి. ఇక మరో ఇండియా జోడీ సందీప్ సింగ్, ఎలవెనిల్ వలరివన్ 12వ స్థానంతో సరిపెట్టుకుంది. ఆ టీమ్ కేవలం 626.3 పాయింట్లు మాత్రమే సాధించింది.
ఈ ఈవెంట్లో భాగంగా ఒక్క షూటర్ 30 సార్లు షూట్ చేశారు. ఒక్కో టీమ్ లోని ఇద్దరు షూటర్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా మెడల్ ఈవెంట్స్ కు టీమ్స్ అర్హత సాధించాయి. టాప్ 2 టీమ్స్ గోల్డ్ మెడల్ కోసం, మూడు, నాలుగు స్థానాల్లోని టీమ్స్ బ్రాంజ్ మెడల్ కోసం పోటీ పడతాయి. చైనా 632.2 పాయింట్లతో టాప్ లో ఉండగా.. కజకిస్తాన్ 630.8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. జర్మనీ 629.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.
ఈసారి ఒలింపిక్స్ లో మెడల్స్ పై ఆశలు రేపుతున్న ఆటల్లో షూటింగ్ కూడా ఒకటి. అయితే తొలి ఈవెంట్లోనే మన నలుగురు షూటర్లు ఇలా నిరాశ పరిచారు. ఇక తొలి రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ క్వాలిఫికేషన్ రౌండ్లలో ఇండియాకు చెందిన అర్జున్ సింగ్ చీమా, సరబ్‌జోత్ సింగ్, మను బాకర్, రిథమ్ సాంగ్వాన్ పోటీ పడనున్నారు.