No hot food for Team India: భారత ఆటగాళ్లకు భోజన సమస్య.. వేడి ఆహారం లేక హోటెల్‌కు వెళ్లిన టీమ్
26 October 2022, 9:20 IST
- No hot food for Team India: మంగళవారం నాడు భారత ఆటగాళ్లు ఆప్షనల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ప్రాక్టీస్ సెషన్ తర్వాత భోజన చేయాలనుకున్న వారికి ఫుల్ మీల్స్ లేదు సరికదా.. ఇచ్చిన ఫుడ్ కూడా వేడిగా లేకపోవడంతో హోటెల్‌కు వెళ్లి తిన్నారు.
టీమిండియాకు భోజన సమస్య
No hot food for Team India: ఆదివారం నాడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అదిరిపోయే విజయాన్ని అందుకున్న టీమిండియా.. ప్రస్తుతం తన తదుపరి గేములపై దృష్టి సారించింది. సూపర్-12లో భాగంగా తన తర్వాత మ్యాచ్ నెదర్లాండ్స్‌తో గురువార నాడు మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ప్రాక్టీస్‌లో పాల్గొంది. సిడ్నీ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ఇప్పటికే ఆటగాళ్ల అక్కడకు చేరుకున్నారు. మంగళవారం నాడు కొంతమంది భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రాక్టీస్ తర్వాత ఇచ్చిన ఆహారం విషయంలో టీమిండియా ప్లేయర్లు సంతృప్తి చెందలేదని బీసీసీఐ వర్గాల సమాచారం. ప్రాక్టీస్ అనంతరం వేడి ఆహారం ఇవ్వకపోవడంతో కొంతమంది ప్లేయర్లు హోటెల్ రూమ్‌కు వచ్చి అక్కడ భోజనం చేశారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
తీవ్రమైన ప్రాక్టీస్ తర్వాత హాట్ ఫుడ్ ఇవ్వడం తప్పనిసరి. కానీ పండ్లు, ఫలాఫెల్(విదేశాల్లో చాలా సాధారణంగా తినే ఫుడ్)తో పాటు శాండ్‌విచ్‌ను మాత్రమే ఇచ్చారని తెలిసింది. దాదాపు మధ్యాహ్నం వరకు ప్రాక్టీస్‌లో ఉన్న ఆటగాళ్లు.. లంచ్ సమయం కావడంతో ఫుల్ మీల్స్ అందిస్తారని ఆశించారు.
"ఇది ఎలాంటి బహిష్కరణ కాదు. ప్రాక్టీస్ తర్వాత ఆటగాళ్లకు పండ్లు, ఫలాఫెల్ తీసుకున్నారు. కానీ ప్రతి ఒక్కరు భోజనం చేయాలని అనుకున్నారు. అక్కడ లేకపోయే సరికి తిరిగి హోటెల్‌కు వెళ్లి భోజనం చేశారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే లంచ్ తర్వాత ఐసీసీ ఎలాంటి వేడి ఆహారాన్ని అందిచలేదు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఆతిథ్య దేశమే క్యాటరింగ్ బాధ్యతలను నిర్వహిస్తుంది. ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఎల్లప్పుడూ వారికి వేడి భోజనాన్ని అందిస్తారు. కానీ ఐసీసీ నియమం అన్ని దేశాలకు ఒకే విధంగా ఉండటం వల్ల భోజన సమస్య తలెత్తింది." అని బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
రెండు గంటల ప్రాక్టీస్ తర్వాత అవకాడో, టమాట, దోసకాయతో కూడిన చల్లని శాండ్‌విచ్(గ్రిల్ కూడా చేయని)ను ఆటగాళ్లు తినలేరని, అది చాలా సాదా, సరిపోని ఆహారం మాత్రమేనని ఆయన అన్నారు. మరి భారత ఆటగాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని బీసీసీఐ రంగంలోకి దిగుతుందో లేదో వేచి చూడాలి.