India Bowling Coach Praises Arshdeep: అర్ష్‌దీప్ ఒత్తిడి అధిగమించే సామర్థ్యం అద్భుతం.. బౌలింగ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
26 October 2022, 8:02 IST
- India Bowling Coach Praises Arshdeep: యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ప్రశంసల వర్షం కురిపించాడు. మైదానంలో అర్ష్‌దీప్ ఒత్తిడిని అధిగమించే విధానం ఎంతో అద్భుతమని కొనియాడాడు.
అర్ష్ దీప్ సింగ్
India Bowling Coach Praises Arshdeep: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం నాడు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అదిరిపోయే స్పెల్‌తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. 3 కీలక వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్ పాక్ పతనంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆరంభంలో అతడు అదిరిపోయే స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కూడా పొగడ్తలతో అతడిని ముంచెత్తారు. అతడిలో ఒత్తిడిని తట్టుకునే నైపుణ్యం అద్భుతమని కొనియాడారు.
గత రెండేళ్లుగా అర్ష్‌దీప్‌ను గమనిస్తే.. అతడు పర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా ఒత్తిడిని మెరుగ్గా అధిగమిస్తున్నాడు. తట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో అతడు ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. విభిన్న దశల్లో బౌలింగ్ చేసి మెరుగ్గా రాణిస్తున్నాడు. పవర్ ప్లే, డెత్ ఓవర్లు ఇలా అన్ని విభాగాల్లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అని పరాస్ మాంబ్రే స్పష్టం చేశారు.
మైదానంలో చాలా కూల్‌గా ఉంటాడని పరాస్.. అర్ష్‌దీప్‌ను ప్రశంసించాడు. "అతడి ప్రశాంతత, ఆలోచన విధానంలో స్పష్టతకు ఎవ్వరైనా కొనియాడాల్సిందే. కెరీర్‌లో హెచ్చు, తగ్గులు ఉంటాయని భావిస్తున్నాను. అయితే అతడు పునరాగమనం చేసిన విధానం, ఒత్తిడిని ఎదుర్కోగల సామర్థ్యం అసాధరణమనే చెప్పాలి. అతడిని చూసి నిజంగా ఆశ్చర్యపోనక్కర్లేదు. పాక్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడిపై మాకు పూర్తి నమ్మకమొచ్చింది. అతడికి మంచి భవిష్యత్తు ఉంది." అని పరాస్ అన్నారు.
పాక్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ 32 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను గోల్డెన్ డకౌట్ చేసి మ్యాచ్‌ను మొదట్లోనే మలుపు తిప్పాడు. అతడితో ఆగకుండా భీకర ఫామ్‌లో ఉన్న మరో పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌ను(4) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు పాక్ ఓపెనర్లను పెవిలియన్ చేర్చిన మొదట బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఫలితంగా పాకిస్థాన్ మొదట 159 పరుగులకు ఆలౌట్ కాగా.. అనంతరం టీమిండియా ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ(82) అద్భుత అర్ధశతకంతో వన్ మ్యాన్ షో చేసి టీమిండియాను అద్భుత విజయాన్ని అందించాడు.