Muguruza Engaged: సెల్ఫీ అడిగిన అభిమానినే పెళ్లి చేసుకోబోతున్న టెన్నిస్ స్టార్
31 May 2023, 17:31 IST
- Muguruza Engaged: సెల్ఫీ అడిగిన అభిమానినే పెళ్లి చేసుకోబోతోంది టెన్నిస్ స్టార్ గార్బైన్ ముగురుజ. అంతేకాదు తన క్యూట్ లవ్ స్టోరీ గురించి కూడా ఆమె చెప్పింది.
కాబోయే భర్త బోర్జెస్ తో టెన్నిస్ స్టార్ ముగురుజ
Muguruza Engaged: స్పోర్ట్స్ స్టార్స్ కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. తమ అభిమాన ప్లేయర్స్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడతారు. కానీ అలా తనను సెల్ఫీ అడిగిన ఓ అభిమానినే పెళ్లి చేసుకోబోతోంది టెన్నిస్ స్టార్ గార్బైన్ ముగురుజ మాజీ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఛాంపియన్ అయిన ముగురుజ.. బోర్జెస్ అనే ఆ అభిమానితో ఎంగేజ్మెంట్ చేసుకుంది.
ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది. బోర్జెస్ ను ముగురుజ తొలిసారి 2021 యూఎస్ ఓపెన్ సందర్భంగా కలిసింది. ఈ సందర్భంగా తమ లవ్ స్టోరీ గురించి కూడా ఆమె వెల్లడించింది. అతన్ని తాను ఎలా కలిశానో, ప్రేమలో పడ్డానో వివరించింది.
"నా హోటల్ సెంట్రల్ పార్క్ కు దగ్గరగా ఉంది. నేను అప్పుడు బోర్ గా ఫీలయ్యాను. సరదాగా నడుద్దామని బయటకు వెళ్లాను. అక్కడే వీధుల్లో అతన్ని తొలిసారి చూశాను. హఠాత్తుగా అతడు నా వైపు చూసి యూఎస్ ఓపెన్ కోసం గుడ్ లక్ అని చెప్పాడు. అతడు చాలా అందంగా ఉన్నాడే అనుకుంటూ అతని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను" అని ముగురుజ తెలిపింది.
అక్కడి నుంచీ ముగురుజ, బోర్జెస్ తరచూ కలుస్తూనే ఉన్నారు. ఆ సెంట్రల్ పార్క్ చుట్టూ నడుస్తూ ప్రేమలో మునిగి తేలారు. బోర్జెస్ కు టెన్నిస్ కు అసలు సంబంధం లేదని, అతడు ఫ్యాషన్ ఇండస్ట్రీలో పని చేస్తున్నాడని, అదే తనను బాగా ఆకర్షించిందని ముగురుజ చెప్పడం విశేషం. తనకు ముందుగా బోర్జెసే ప్రపోజ్ చేసినట్లు కూడా ముగురుజ తెలిపింది.
"నాకు వింతగా అనిపించింది. నేనేదో ఆలోచిస్తున్నాను. అతడు నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఏడవడం ప్రారంభించాను. నాకు ఎలా రియాక్టవ్వాలో తెలియలేదు. కన్నీళ్ల మధ్యే ఎస్ అని చెప్పాను. అది చాలా రొమాంటిక్ గా అనిపించింది" అని ముగురుజ వెల్లడించింది. మూడేళ్ల వయసు నుంచే టెన్నిస్ ఆడటం ప్రారంభించిన ముగురుజ.. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లాంటి గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలవడం విశేషం.