తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ms Dhoni In Team India: మళ్లీ టీమిండియాలోకి ధోనీ.. బీసీసీఐ కీలక నిర్ణయం!

MS Dhoni in Team India: మళ్లీ టీమిండియాలోకి ధోనీ.. బీసీసీఐ కీలక నిర్ణయం!

Hari Prasad S HT Telugu

15 November 2022, 20:45 IST

google News
    • MS Dhoni in Team India: మళ్లీ టీమిండియాలోకి ధోనీ వస్తున్నాడా? ఆ దిశగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతోందా? తాజాగా వస్తున్న వార్తలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ (PTI)

టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ

MS Dhoni in Team India: ఈ మధ్య ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే దారుణంగా ఓడి ఇంటిదారి పట్టడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. కనీస పోరాటం లేకుండా ఇంగ్లండ్‌కు తల వంచడం ఒకెత్తయితే.. ఐసీసీ టోర్నీల్లో బోల్తా పడుతున్న ఆనవాయితీ కొనసాగడం కూడా ఫ్యాన్స్‌కు మింగుడు పడటం లేదు.

2007లో ధోనీ కెప్టెన్సీలో టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత మళ్లీ ఇప్పటి వరకూ మరో ట్రోఫీ రాలేదు. 2014లో ఫైనల్‌ వరకూ వెళ్లింది. ఆ తర్వాత 2016లో, ఇప్పుడు 2022లోనూ సెమీస్‌కు వచ్చినా ఫైనల్‌కు వెళ్లలేకపోయింది. దీంతో టీ20ల్లో టీమిండియాను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ దిశగానే బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందులో భాగంగానే మాజీ కెప్టెన్‌ ఎమ్మెస్‌ ధోనీని తిరిగి ఇండియన్‌ టీమ్‌లోకి తీసుకురావాలని బోర్డు భావిస్తున్నట్లు ది టెలిగ్రాఫ్‌ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏదో ఒక హోదాలో తిరిగి ధోనీని ఇండియన్‌ టీమ్‌లోకి తీసుకొచ్చి అతని అనుభవాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్‌ తర్వాత మిస్టర్‌ కూల్‌ ఎలాగూ ఆ మెగా లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పనున్నాడు.

దీంతో ఆ తర్వాత అతని అనుభవాన్ని ఇండియన్‌ టీమ్‌ను మెరుగు పరచేందుకు ఉపయోగించుకోవడం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 2021 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఇండియన్‌ టీమ్‌ మెంటార్‌గా ధోనీ వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు 2024 టీ20 వరల్డ్‌కప్‌ లోపు ఇండియన్‌ టీమ్‌ను టీ20ల్లో పటిష్టంగా మార్చడమే లక్ష్యంగా బోర్డు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

కొందరు సీనియర్లు ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడం, కోచ్‌లను కూడా వేర్వేరుగా నియమించడంలాంటివి చేయాలన్న సలహాలు, సూచనలు వినిపిస్తున్నాయి. వీటిపై ఈ నెల చివర్లో జరగబోయే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో బోర్డు చర్చించనుంది. ముఖ్యంగా టీ20ల్లో ఇండియన్ టీమ్‌ భయం లేని క్రికెట్‌ ఆడే విధంగా చేసేందుకు ధోనీకి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.

ప్రత్యేకంగా టీ20ల్లోకే ఎంపికయ్యే జట్టు సభ్యులతో ధోనీ కలిసి పని చేసి, వాళ్లను మరింత రాటుదేల్చే అవకాశం ఉన్నట్లు కూడా టెలిగ్రాఫ్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు మూడు ఫార్మాట్లు చూసుకోవడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో టీ20 బాధ్యతలు ధోనీకి అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది.

ధోనీ కెప్టెన్సీలోనే ఇండియా 2007 టీ20 వరల్డ్‌కప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. అసలు ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌ కూడా ధోనీయే కావడం విశేషం. అలాంటి వ్యక్తి ఇండియన్‌ టీమ్‌లోకి మరోసారి ఏ హోదాలో వచ్చినా అది ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.

తదుపరి వ్యాసం