Jhulan Goswami Farewell Match: ఝులన్ చివరి మ్యాచ్.. కంటతడి పెట్టుకున్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్
24 September 2022, 16:39 IST
- Jhulan Goswami Farewell Match: ఝులన్ గోస్వామి తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతోంది. దీంతో మ్యాచ్‌కు ముందు ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కంటతడి పెట్టుకుంది.
ఝులన్ గోస్వామిని గట్టిగా హత్తుకొని కంటతడి పెట్టిన హర్మన్ ప్రీత్ కౌర్
Jhulan Goswami Farewell Match: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ వెటరన్ పేస్‌బౌలర్ ఝులన్ గోస్వామి శనివారం (సెప్టెంబర్ 24) తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచే ఆమెకు చివరిది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు ఝులన్‌కు జ్ఞాపికను అందజేసి సత్కరించారు. అయితే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎమోషనల్ అయింది.
తనకెంతో ఇష్టమైన ప్లేయర్ రిటైరవుతుండటంతో కంటతడి పెట్టుకుంది. ఇక నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లో ఝులన్‌తో గడిపే అవకాశం రాదని తెలిసి హర్మన్ భావోద్వేగానికి గురైంది. ఇండియన్ టీమ్ తరఫున 204 వన్డేలు, 68 టీ20లు, 12 టెస్టులు ఆడిన ఝులన్.. ఇంగ్లండ్ టూర్ తర్వాత రిటైరవుతున్నట్లు గత నెలలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
మహిళల వన్డేలో 253 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా ఝులన్ చరిత్ర సృష్టించింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే టాస్‌కు ముందు ఇండియన్ టీమ్ ప్లేయర్స్ ఝులన్ గురించి మాట్లాడారు. ఈ సమయంలోనే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. ఝులన్ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే హర్మన్ ఇండియన్ టీమ్‌లో అడుగుపెట్టింది.
ఇప్పుడు హర్మన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే ఝులన్ తన చివరి మ్యాచ్ ఆడుతోంది. ఈ వెటరన్ పేస్‌బౌలర్‌తో హర్మన్‌ప్రీత్‌కు మంచి రిలేషన్ ఉంది. ఈ ఫొటోలను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఝులన్ మొత్తం 353 వికెట్లు తీసుకుంది. ఇక మహిళల వరల్డ్‌కప్‌లలో 43 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా ఝులన్ పేరిటే ఉంది.
ఇండియన్ టీమ్ మూడుసార్లు ఆసియాకప్ గెలిచిన సందర్భాల్లో ఝులన్ టీమ్‌లోనే ఉంది. ఇక 2005, 2017లలో వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడినప్పుడు కూడా ఆమె టీమ్‌లో సభ్యురాలు. ఈ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఝులన్.. ఇంతకాలం క్రికెట్‌లో కొనసాగుతానని తానెప్పుడూ ఊహించలేదని చెప్పింది. మిథాలీతో తాను చాలా ఎక్కువ కాలం కలిసి ఆడిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
ఇప్పుడు బాలీవుడ్‌లో ఝులన్ గోస్వామి బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే. చక్డా ఎక్స్‌ప్రెస్ పేరుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ నటి అనుష్క శర్మ.. ఝులన్ పాత్రలో కనిపిస్తోంది. దీనికోసం ఆమె లండన్‌లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటోంది.