Jhulan Goswami Retirement: లార్డ్స్‌లో ఝులన్ గోస్వామి చివరి మ్యాచ్
Jhulan Goswami Retirement: లార్డ్స్‌లో ఝులన్ గోస్వామి తన చివరి మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ తర్వాత ఆమె ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ కానుంది.
Jhulan Goswami Retirement: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ పేస్ బౌలర్ ఝులన్ గోస్వామి ఇంటర్నేషనల్ కెరీర్ పూర్తి కావస్తోంది. ఆమె తన చివరి సిరీస్‌ను ఇంగ్లండ్‌తో ఆడబోతోంది. ఈ సిరీస్ కోసం మంగళవారం (ఆగస్ట్ 30) టీమ్ బయలుదేరి వెళ్లింది. ఈ సందర్భంగా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాట్లాడుతూ.. ఝులన్ చివరి సిరీస్ ఆమెతోపాటు తమకందరికీ స్పెషల్ అని చెప్పింది.
సెప్టెంబర్ 24న ప్రతిష్టాత్మక లార్డ్స్‌లో జరగబోయే మ్యాచ్‌తో ఝులన్ గోస్వామి తన కెరీర్‌కు ముగింపు పలకనుంది. ఇప్పటి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 2009లో తొలిసారి ఇండియన్ టీమ్‌లోకి వచ్చిన సమయంలో ఝులనే కెప్టెన్‌గా ఉంది. ఇప్పుడు హర్మన్ కెప్టెన్సీలో ఝులన్ తన చివరి మ్యాచ్ ఆడనుండటం విశేషం. "ఆమె టీమ్‌లో ఉండటం మా అందరికీ మంచి సపోర్ట్, బ్యాలెన్స్ ఇస్తుంది. ఇది ఆమె చివరి సిరీస్. ఇది ఆమెతోపాటు మా అందరికీ స్పెషల్" అని హర్మన్‌ప్రీత్ చెప్పింది.
ఝులన్ తన చివరి మ్యాచ్‌ను ఆడుతున్న సమయంలో తాను టీమ్‌ను లీడ్ చేయబోతుండటం తనకు గొప్ప అవకాశమని హర్మన్ అభిప్రాయపడింది. ఆమె కోసం తాము కొన్ని గొప్ప క్షణాలను క్రియేట్ చేయబోతున్నామని, వీటిని ఆమె ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని చెప్పింది. ఝులన్ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదని స్పష్టం చేసింది.
ఈ 13 ఏళ్ల కెరీర్‌లో ఝులన్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు కూడా తెలిపింది. "తన కెరీర్ తొలి నాళ్లలాగే ఇప్పటికీ ఝులన్ ఎంతో శ్రమిస్తుంది. ప్రాక్టీస్‌ను ఆమె ఎప్పుడూ తేలిగ్గా తీసుకోలేదు. ప్రాక్టీస్ సందర్బంగా రెండు, మూడు గంటల పాటు బౌలింగ్ చేస్తుంది. ఈ రోజుల్లో అంతలా ప్రాక్టీస్ చేసేవాళ్లు ఎవరూ ఉండరు. ఓ క్రికెటర్‌గా, వ్యక్తిగా నేను ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను" అని హర్మన్ చెప్పింది.
39 ఏళ్ల ఝులన్ గోస్వామి.. ఇంగ్లండ్ టూర్ కోసం టీమ్ సెలక్షన్‌కు ముందే సెలక్టర్లను కలిసి తన రిటైర్మెంట్ విషయం చెప్పింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో చివరిసారి ఝులన్ ఇండియన్ టీమ్‌కు ఆడింది. ప్రస్తుతం ఝులన్ బయోపిక్ కూడా రూపొందుతోంది. అందులో విరాట్ కోహ్లి భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మనే ఝులన్ పాత్రలో కనిపిస్తోంది. దీనికోసం అనుష్క ప్రత్యేకంగా క్రికెట్ శిక్షణ కూడా తీసుకుంటోంది.