Anushka Sharma: క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ-anushka sharma to undergo cricket training for her next movie chakda express ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anushka Sharma To Undergo Cricket Training For Her Next Movie Chakda Express

Anushka Sharma: క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటున్న విరాట్‌ కోహ్లి భార్య అనుష్క శర్మ

Hari Prasad S HT Telugu
Aug 03, 2022 03:22 PM IST

Anushka Sharma: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకుంటోంది. దీనికోసం ఆమె యూకేలోని లీడ్స్‌కు వెళ్లింది.

చక్డా ఎక్స్ ప్రెస్ మూవీ కోసం అనుష్క శర్మ ఇలా మారింది
చక్డా ఎక్స్ ప్రెస్ మూవీ కోసం అనుష్క శర్మ ఇలా మారింది (Twitter)

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఇక క్రికెట్‌ ట్రైనింగ్‌ తీసుకోనుంది. దీనికోసం నెట్స్‌లో చెమటోడ్చనుంది. ఆమె తన తర్వాతి మూవీ చక్డా ఎక్స్‌ప్రెస్‌ కోసం ప్రత్యేకంగా ఇలా శిక్షణ తీసుకోనుండటం విశేషం. ఇండియన్‌ వుమెన్‌ టీమ్‌ పేస్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ ఈ చక్డా ఎక్స్‌ప్రెస్‌. ఇందులో ఝులన్ పాత్రలో అనుష్క కనిపించనుంది.

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడైన విరాట్‌ కోహ్లి భార్య అనుష్క ఇప్పుడు ఓ క్రికెటర్‌ బయోపిక్‌లో నటిస్తుండటం, దీనికోసం ట్రైనింగ్‌ తీసుకోవడం విశేషం. ఈ నెలలో ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో అనుష్క శర్మ తన క్రికెట్‌ స్కిల్స్‌ను మెరుగుపరచుకోనుంది. ఆ తర్వాతే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.

తాను పోషించే పాత్రకు పూర్తి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా ప్రత్యేకంగా క్రికెట్‌ శిక్షణ తీసుకుంటున్నట్లు అనుష్క శర్మ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనికోసం ఆమె కఠినమైన ట్రైనింగ్‌ పూర్తి చేయనున్నట్లు చెప్పాయి. ఈ నెల చివరి నుంచి సెప్టెంబర్‌ వరకూ చక్డా ఎక్స్‌ప్రెస్‌లోని కీలక సీన్స్‌కు సంబంధించిన షూటింగ్‌ను అనుష్క చేయనుంది.

మూడేళ్ల తర్వాత అనుష్క ఈ చక్డా ఎక్స్‌ప్రెస్‌తోనే మరోసారి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించనుంది. చివరిసారి షారుక్‌ఖాన్‌తో కలిసి జీరో మూవీలో నటించిన ఆమె.. ఆ తర్వాత ప్రెగ్నెంట్‌ అయింది. ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఆమె బాగోగులు చూసుకొని.. మళ్లీ మూవీల్లోకి అడుగుపెట్టింది. అయితే వచ్చీరాగానే ఆమె క్రికెటర్‌ పాత్రలో కనిపించనుండటం విశేషం. తన జీవితంలో ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈస్థాయికి చేరిన ఇండియన్‌ వుమెన్స్‌ టీమ్‌ పేస్‌బౌలర్‌ ఝులన్‌ గోస్వామి జీవితానికి ఈ సినిమా అద్దం పట్టనుంది.

IPL_Entry_Point