తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Afridi On Harmanpreet: హర్మన్‌ప్రీత్ మరీ ఎక్కువ చేసింది.. అఫ్రిది విమర్శలు

Afridi on Harmanpreet: హర్మన్‌ప్రీత్ మరీ ఎక్కువ చేసింది.. అఫ్రిది విమర్శలు

Hari Prasad S HT Telugu

26 July 2023, 11:39 IST

google News
    • Afridi on Harmanpreet: హర్మన్‌ప్రీత్ మరీ ఎక్కువ చేసింది అంటూ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది విమర్శలు గుప్పించాడు. బంగ్లాదేశ్ తో చివరి వన్డే సందర్భంగా హర్మన్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.
హర్మన్ ప్రీత్ తీరుపై విమర్శలు గుప్పించిన అఫ్రిది
హర్మన్ ప్రీత్ తీరుపై విమర్శలు గుప్పించిన అఫ్రిది (File)

హర్మన్ ప్రీత్ తీరుపై విమర్శలు గుప్పించిన అఫ్రిది

Afridi on Harmanpreet: ఇండియన్ వుమెన్స్ క్రికెట్ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పై క్రికెట్ ప్రపంచం విమర్శలు గుప్పిస్తూనే ఉంది. బంగ్లాదేశ్ తో చివరి వన్డేలో అంపైర్లతో ఆమె వ్యవహరించిన తీరుపై పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హర్మన్ మరీ ఎక్కువ చేసిందని అతడు అనడం గమనార్హం. ఈ మ్యాచ్ లో తనను ఔట్ గా ఇచ్చిన తర్వాత హర్మన్ స్టంప్స్ ను బ్యాట్ తో కొట్టిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత అంపైరింగ్ చాలా దారుణంగా ఉందని, భవిష్యత్తులో బంగ్లాదేశ్ టూర్ కు వచ్చే సమయంలో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే రావాల్సి ఉంటుందని మ్యాచ్ తర్వాత హర్మన్ పబ్లిగ్గా విమర్శించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఐసీసీ ఆమెకు నాలుగు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. దీంతో రెండు వన్డేలపై నిషేధం ఎదుర్కొంది.

ఈ ఘటనపై పాక్ మాజీ కెప్టెన్ అఫ్రిది స్పందించాడు. "ఇండియా విషయంలోనే కాదు. గతంలోనూ ఇలాంటివి జరిగాయి. అయితే వుమెన్స్ క్రికెట్ లో ఇలాంటి అరుదుగా చూస్తుంటాం. ఇది చాలా ఎక్కువగా అనిపించింది. ఐసీసీ నిర్వహించిన పెద్ద ఈవెంట్ లో జరిగింది. ఈ శిక్షతో భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఓ హెచ్చరిక పంపినట్లు అయింది. క్రికెట్ లో దూకుడు సహజమే. అయితే నియంత్రిత దూకుడు మంచిది. ఇది మాత్రం చాలా ఎక్కువగా అనిపించింది" అని అఫ్రిది స్పష్టం చేశాడు.

అఫ్రిదియే కాదు.. హర్మన్ తీరుపై భారత మాజీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మదన్ లాల్ లాంటి మాజీ క్రికెటర్ స్పందిస్తూ.. బీసీసీఐ కూడా హర్మన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఐసీసీ విధించిన రెండు వన్డేల నిషేధంతో ఆమె ఏషియన్ గేమ్స్ లో ఇండియా ఆడబోయే తొలి రెండు వన్డేలకు దూరం కానుంది.

తదుపరి వ్యాసం