Afridi on Modi: మోదీ వచ్చినప్పటి నుంచీ పాకిస్థాన్‌కి కష్టాలే: మాజీ క్రికెటర్ అఫ్రిది
Afridi on Modi: మోదీ వచ్చినప్పటి నుంచీ పాకిస్థాన్‌కి కష్టాలే అని అన్నాడు మాజీ క్రికెటర్ అఫ్రిది. ఆసియా కప్ పాకిస్థాన్ లో జరగకుండా చూడటానికి బీసీసీఐ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతడీ కామెంట్స్ చేశాడు.
Afridi on Modi: ఇండియాలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పాకిస్థాన్ కు అన్నీ నష్టాలే తప్ప ఒక్కటి కూడా లాభం జరగలేదని అన్నాడు అక్కడి మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది. అంతేకాదు మోదీ ఉన్నంత వరకూ పాక్‌కు ఏదో మంచి జరుగుతుందన్న ఆశలు కూడా లేవని కూడా అనడం గమనార్హం. ఆసియాకప్ పై చర్చ సందర్భంగా అతడీ కామెంట్స్ చేశాడు.
ఓ టీవీ ఛానెల్లో డిబేట్ కోసం వెళ్లిన అఫ్రిది మరోసారి భారత ప్రధానిపై తన ఆవేశాన్ని వెల్లగక్కాడు. గతంలో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లు జరిగేలా చూడాలని తానే నేరుగా మోదీని కలిసి అడుగుతానని అఫ్రిది అన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా మోదీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ దేశానికి తీవ్ర నష్టం జరుగుతోందని వాపోయాడు. ఆసియాకప్ పరిస్థితిపై మీరేమంటారు అని అఫ్రిదిని అడిగినప్పుడు అతడిలా స్పందించాడు.
"మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పాకిస్థాన్ కు అనుకూలంగా ఏదీ జరగలేదు. చరిత్ర ఇదే చెబుతోంది. గతంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ అప్పుడు కూడా గత ప్రధానమంత్రులతో మంచి సంబంధాలు ఉండేవి. నేను కేవలం మోదీ గురించే మాట్లాడుతున్నా. ఆయన నుంచి ఎలాంటి ఆశలూ లేవు. ఆయన మనకు నష్టమే చేస్తారు. మనకు అనుకూలంగా ఆయన ఏదీ చేయరు" అని అఫ్రిది చాలా ఆవేశంగా అన్నాడు.
ఈ ఏడాది పాకిస్థాన్ లో ఆసియాకప్ జరగాల్సి ఉంది. అయితే బీసీసీఐ మాత్రం తమ జట్టును పంపబోమని తేల్చి చెబుతోంది. అంతేకాదు ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా.. ఆసియా కప్ నే అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాక్ మాజీ క్రికెటర్లు బీసీసీఐ, భారత ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
సంబంధిత కథనం