India vs Pakistan: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్-india vs pakistan world cup match to be held at narendra modi stadium in ahmedabad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Vs Pakistan World Cup Match To Be Held At Narendra Modi Stadium In Ahmedabad

India vs Pakistan: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్

Hari Prasad S HT Telugu
May 05, 2023 07:54 AM IST

India vs Pakistan: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా, పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్, నవంబర్ లలో ఇండియా ఆతిథ్యమివ్వబోయే వరల్డ్ కప్ లో ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కు అహ్మదాబాదే వేదిక కానుంది.

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం

India vs Pakistan: ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమివ్వడం ఖాయంగా కనిపిస్తోంది. 2016 తర్వాత భారత గడ్డపై తొలిసారి దాయాదుల తలపడబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కు ఇండియా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం, లక్ష మంది అభిమానులు మ్యాచ్ చూసే అవకాశం ఈ నరేంద్ర మోదీ స్టేడియంలో ఉంది. ఎలాగూ ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ఓ రేంజ్ లో డిమాండ్ ఉంటుంది. పాకిస్థాన్ తోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అభిమానులు ఈ మ్యాచ్ చూడటానికి వస్తారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లోని ఈ స్టేడియంలోనే ఇండోపాక్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోనూ వరల్డ్ కప్ మ్యాచ్‌లు

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ముగియగానే వరల్డ్ కప్ షెడ్యూల్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేయాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ తోపాటు నాగ్‌పూర్, బెంగళూరు, త్రివేండ్రం, ముంబై, ఢిల్లీ, లక్నో, గువాహటి, కోల్‌కతా, రాజ్‌కోట్, ఇండోర్, ధర్మశాలల్లో వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి.

అయితే ఇందులో ఏడు వేదికల్లో మాత్రమే ఇండియా మ్యాచ్ లు ఉంటాయి. అందులో అహ్మదాబాద్ ఒకటి. ఫైనల్ కూడా ఇక్కడే జరగనుండటంతో ఇండియా తుది సమరానికి వెళ్తే నరేంద్ర మోదీ స్టేడియంలో రెండు ఇండియా మ్యాచ్ లు జరిగినట్లు అవుతుంది. ఇక పాకిస్థాన్ టీమ్ మాత్రం భద్రతా కారణాల వల్ల చాలా వరకూ మ్యాచ్ లు కేవలం చెన్నై, బెంగళూరులలోనే ఆడనున్నట్లు సమాచారం.

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ను కూడా ఆ టీమ్ కు ఓ వేదికగా అనుకుంటున్నారు. అటు బంగ్లాదేశ్ టీమ్ కూడా తన మ్యాచ్ లను కోల్‌కతా గువాహటిల్లోనే ఆడనుంది. నవంబర్ లో వర్షాలు పడే అవకాశం ఉండటం వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో నవంబర్ తొలి వారంలోపే అన్ని మ్యాచ్ లు ముగిసిపోయేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

వేదికల విషయంలో ఇండియన్ టీమ్ ను కూడా బీసీసీఐ సంప్రదించిందట. అయితే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికాలతో మ్యాచ్ లకు మాత్రం స్పిన్ కు ఎక్కువగా అనుకూలించే గ్రౌండ్ లు ఉండేలా చూడాలని టీమ్ మేనేజ్‌మెంట్ కోరినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది.

WhatsApp channel

సంబంధిత కథనం