India vs Pakistan Series: 2027 వరకూ పాకిస్థాన్‌తో ఇండియా సిరీస్ లేనట్లే
India vs Pakistan Series: 2027 వరకూ పాకిస్థాన్‌తో ఇండియా సిరీస్ లేనట్లే అని తేలిపోయింది. తాజాగా బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు పంపిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)తో ఇది స్పష్టమైంది.
India vs Pakistan Series: పదేళ్లుగా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. ఈ దాయాదులు ఐసీసీ టోర్నీల్లో ఆడటమే తప్ప మిగతా టీమ్స్‌లాగా ఒక దేశానికి మరొకరు వెళ్లలేదు. ఇది మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నట్లు స్పష్టమైంది. 2027 వరకూ ఈ రెండు దేశాల క్రికెట్ మ్యాచ్‌లు ఐసీసీ ఈవెంట్లలోనే చూసే అవకాశం అభిమానులకు ఉంది.
తాజాగా బీసీసీఐ తయారు చేసిన ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)తో ఇది స్పష్టమైంది. ఈ ఎఫ్‌టీపీని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు పంపించారు. ఇందులో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఉన్న కాలమ్‌ను బోర్డు ఖాళీగా వదిలేసింది. ఇక 2023-27 మధ్య ఇండియన్ టీమ్ సొంతగడ్డపై 20 టెస్టులు (మొత్తంగా 38), 21 వన్డేలు (మొత్తం 42), 31 టీ20 (మొత్తం 61)లు ఆడనుంది.
పాకిస్థాన్ సిరీస్‌లపై భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే వరకూ బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ వచ్చే ఐదేళ్ల కాలంలో ఇండియా ఆడే మ్యాచ్‌ల సంఖ్య తగ్గింది. 2018-22 మధ్య ఇండియా మొత్తంగా 163 మ్యాచ్‌లు ఆడగా.. ఈసారి అది 141కి తగ్గిపోయింది. వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏటా ఏదో ఒక ఐసీసీ ఈవెంట్ ఉండటం, ఐపీఎల్‌కు మరిన్ని ఎక్కువ రోజులు (సీజన్‌కు 75-80 రోజులు) కేటాయించడంతో మ్యాచ్‌ల సంఖ్య తగ్గిపోయింది.
అయితే ఈ సైకిల్‌లో సొంతగడ్డపై ఇండియా ఆడే టెస్టులు ఎక్కువగా ఉన్న విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జే షా గుర్తు చేశారు. ఇక ఈ సైకిల్‌లో ఇండియా ఎక్కువగా ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై, వాళ్ల దేశాల్లో ఐదేసి టెస్ట్‌ల సిరీస్‌లు కూడా ఇండియా ఆడుతుంది. ప్రతి నాలుగేళ్లకోసారి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలతో సొంతగడ్డపై ఐదేసి టెస్ట్‌ల సిరీస్ జరగనుంది.
ఇక వెస్టిండీస్, న్యూజిలాండ్‌లతో మాత్రం ఐదేసి టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. ఈ రెండు టీమ్స్‌తో ఈ ఫార్మాట్‌లో ఇండియా తలపడటం ఫ్యాన్స్‌ను ఎక్కువగా ఆకర్షిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.