Roger Binny as BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ-roger binny set to become bcci president ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Roger Binny As Bcci President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ

Roger Binny as BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ

Hari Prasad S HT Telugu
Oct 11, 2022 05:24 PM IST

Roger Binny as BCCI President: బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ ఎన్నిక లాంఛనమే కానుంది. 1983 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ టీమ్‌ మెంబర్‌ అయిన బిన్నీ.. మంగళవారం (అక్టోబర్‌ 11) తన నామినేషన్‌ దాఖలు చేశాడు.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నిక ఇక లాంఛనమే
బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ఎన్నిక ఇక లాంఛనమే (PTI)

Roger Binny as BCCI President: ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్‌ బోర్డు బీసీసీఐ (బోర్డ్‌ ఆఫ్ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా)కి కొత్త అధ్యక్షుడు రానున్నాడు. మాజీ క్రికెటర్‌, 1983 వరల్డ్‌కప్‌ విన్నింగ్ టీమ్‌ మెంబర్‌ రోజర్‌ బిన్నీ బోర్డుకు తర్వాతి అధ్యక్షుడు కానున్నాడు. మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి పోటీ చేయకపోవడంతో బిన్నీ ఎన్నిక ఇక లాంఛనమే కానుంది.

అక్టోబర్‌ 18న జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో రోజర్‌ బిన్నీ ఎన్నికను ప్రకటించనున్నారు. కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (కేఎస్‌సీఏ) ప్రెసిడెంట్‌గా చేసిన రోజర్‌ బిన్నీ మంగళవారం (అక్టోబర్‌ 11) బీసీసీఐ అధ్యక్ష పదవి కోసం నామినేషన్‌ దాఖలు చేసినట్లు స్పోర్ట్స్‌ స్టార్‌ వెల్లడించింది. గంగూలీ పోటీ చేయకపోవడంతో బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికవనున్నాడు.

కార్యదర్శిగా కొనసాగనున్న జే షా

బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నారు. కూలింగ్ ఆఫ్‌ పీరియడ్‌ అవసరం లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత జే షా బీసీసీఐ అధ్యక్షుడు అవుతారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన మాత్రం కార్యదర్శి పదవిలోనే కొనసాగనున్నారు. ఇక రాజీవ్‌ శుక్లా కూడా వైస్‌ ప్రెసిడెంట్‌గానే ఉంటారు. ఇక ముంబైకి చెందిన బీజేపీ నేత ఆశిశ్‌ షేలార్‌ కోశాధికారి పదవి కోసం నామినేషన్‌ వేశారు.

జాయింట్‌ సెక్రటరీ పోస్ట్‌ కోసం అస్సాంకు చెందిన దేవజిత్‌ సైకియా పోటీ పడనున్నారు. షేలార్‌ అటు ముంబై క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్ష పదవి కోసం కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈ అధ్యక్ష పదవి రేసు నుంచి ఆయన తప్పుకునే అవకాశం ఉంది. ఈ రేసులో బిన్నీ మాజీ టీమ్‌ మేట్‌ సందీప్‌ పాటిల్‌ ఉన్నారు. ఇన్నాళ్లూ బీసీసీఐ కోశాధికారిగా ఉన్న అరుణ్‌ ధుమాల్‌.. ఇక ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ పదవి చేపట్టనున్నారు.

గంగూలీ పరిస్థితి ఏంటి?

ఇన్నాళ్లూ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌ గంగూలీ రెండోసారి పోటీ చేయడం లేదు. మరి ఆయన భవితవ్యం ఏంటన్నదానిపై స్పష్టత లేదు. ఆయనను ఐసీసీ ఛైర్మన్‌ పదవికి బీసీసీఐ మద్దతిస్తుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి సంబంధించి సోమవారం గంగూలీ ముంబైలో పలు సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే అక్టోబర్‌ 18న జరగబోయే బీసీసీఐ ఏజీఎంలోనే తమ తరఫున ఐసీసీ ప్రతినిధి ఎవరన్నది నిర్ణయిస్తామని రాజీవ్‌ శుక్లా వెల్లడించారు. దీనిపై గంగూలీ కూడా స్పందించలేదు.

WhatsApp channel

టాపిక్