Harmanpreet Kaur suspended: హర్మన్‌ప్రీత్‌పై ఐసీసీ కఠిన చర్యలు.. రెండు వన్డేల నిషేధం
Harmanpreet Kaur suspended: హర్మన్‌ప్రీత్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. ఆమెపై రెండు వన్డేల నిషేధం విధించింది. దీంతో ఏషియన్ గేమ్స్ లో తొలి రెండు మ్యాచ్ లకు ఆమె ఆడే అవకాశం లేదు.
Harmanpreet Kaur suspended: ఇండియన్ వుమెన్స్ టీమ్ కు షాక్ తగిలింది. బంగ్లాదేశ్ తో చివరి వన్డే సందర్భంగా అనుచితంగా ప్రవర్తించిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంది. మంగళవారం (జులై 25) ఆమెపై రెండు వన్డేల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన కారణంగా ఆమెపై ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపిది.
"ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్ షిప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో ఢాకాలో జరిగిన మ్యాచ్ లో ఈ ఘటనలు జరిగాయి. హర్మన్ తనను ఔట్ గా ప్రకటించగానే స్టంప్స్ ను బ్యాట్ తో కొట్టింది. ఇది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ 2.8 ఆర్టికల్ ఉల్లంఘించడమే అవుతుంది. అందుకే ఆమెకు 50 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించాం" అని ఐసీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇక ఓ అంతర్జాతీయ మ్యాచ్ లో జరిగిన ఘటనను పబ్లిక్ గా విమర్శించడం వల్ల లెవల్ 1 తప్పిదంగా భావించి మరో 25 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించారు. అయితే మొదటి తప్పిదం లెవల్ 2 కావడంతో ఆమెకు మొత్తం 4 డీమెరిట్ పాయింట్లు కేటాయించారు. దీంతో తర్వాతి రెండు వన్డే మ్యాచ్ లు ఆడే అవకాశం హర్మన్ కోల్పోయింది.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 2 తప్పిదానికి 50 నుంచి 100 శాతం మ్యాచ్ ఫీజు, మూడు నుంచి నాలుగు డీమెరిట్ పాయింట్లు కోత విధిస్తారు. ఇప్పుడు హర్మన్ విషయంలోనూ అదే జరిగింది. ఓ లెవల్ 2, మరో లెవల్ 1 తప్పిదం కారణంగా 75 శాతం మ్యాచ్ ఫీజు కోల్పోవడంతోపాటు రెండు మ్యాచ్ లపై నిషేధం పడింది. దీంతో రానున్నఏషియన్ గేమ్స్ లో ఇండియా ఆడబోయే తొలి రెండు మ్యాచ్ లలో హర్మన్ ఆడే వీలుండదు.
ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రవర్తించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారత మాజీ క్రికెటర్లు కూడా హర్మన్ తీరును తప్పుబట్టారు. ఇండియన్ క్రికెట్ పరువు తీసిందని వాళ్లు విమర్శించారు. ఈ మ్యాచ్ లో తనను ఔట్ గా ప్రకటించిన తర్వాత హర్మన్ స్టంప్స్ ను బ్యాట్ తో కొట్టడంతోపాటు ట్రోఫీ అందుకునే సమయంలోనూ అంపైర్ల వల్లే బంగ్లాదేశ్ మ్యాచ్ టై చేసుకుందని, వాళ్లను కూడా ట్రోఫీ అందుకోవడానికి పిలవండని అనడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.