Ruturaj on Dhoni: ధోనీ మరో ఐదేళ్లు ఆడతాడు.. చెన్నై ప్లేయర్ స్పష్టం
21 May 2023, 16:02 IST
- Ruturaj on Dhoni: మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అనుకుంటున్న తరుణంలో.. అతడి గురించి చెన్నై ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహీ మరో ఐదేళ్లు ఆడతాడని స్పష్టం చేశాడు.
ఎంఎస్ ధోనీ
Ruturaj on Dhoni: ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ వయసు 40 ఏళ్లు. క్రికెట్‌లో ఇంత వయసు వచ్చిన తర్వాత ఆడిన ఆటగాళ్లు చాలా అరుదు. ఫలితంగా ఈ సీజనే ధోనీకి చివరదని అనుకుంటున్న తరుణంలో.. మన మిస్టర్ కూల్ మరిన్నీ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవలే ధోనీ సైతం.. తనకు ఇదే చివరి ఐపీఎల్ అని ఎప్పుడు తను అనలేదని స్పష్టం చేశాడు. దీంతో అతడు మరికొన్ని రోజుల పాటు క్రికెట్‌లో కొనసాగుతాడని హింట్ ఇచ్చినట్లయింది. తాజాగా ధోనీ భవితవ్యం గురించి సీఎస్‌కే ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే చిట్ చాట్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ధోనీ ఇంకో ఐదేళ్లు ఆడతాడని రుతురాజ్.. కాన్వేతో అన్నాడు.
"నిజాయితీగా చెప్పాలంటే అతడి(ధోనీ) సారథ్యంలో 50 మ్యాచ్‌లు ఆడానంటే గొప్ప అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. నా మొదటి గేమ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన జర్నీలో అతడిని చూస్తూనే ఉన్నాను. ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు. ఏమాత్రం తేడా లేదు. ఎంతో వినమ్రంగా, ఓపెన్‌గా మాట్లాడతాడు. ప్రతిసారి నా వెనకే ఉండి నన్ను ముందుకు నడిపించి ఆత్మవిశ్వాసం కలిగిస్తాడు. అతడు ఏం చెబుతాడో నాకు తెలుసు అలాగే నేను కూడా ఏదైనా అడగుతాను. అంతలా ప్రోత్సహిస్తాడు" అంటూ ధోనీ గురించి రుతురాజ్ చెబుతాడు.
సీఎస్‌కేలో ధోనీ ఉండటం ఆ జట్టు అదృష్టమని కాన్వే అంటాడు. "ధోనీ చాలా కాలం క్రికెట్ ఆడాడు. అతడంటే గౌరవముంది. అలాంటి వ్యక్తి సపోర్ట్ చేస్తూ.. మీపై నమ్మకం పెట్టుకున్నట్లయితే ఎంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అతడు జట్టులో ఉండటం నిజంగా మా అదృష్టం." అని రుతురాజ్‌కు వివరిస్తాడు. అలాగే ఇది ధోనీకి చివరి సీజన్ అవుతుందా? అనే ప్రశ్నకు రుతురాజ్ బదులిస్తూ మరో ఐదేళ్లు ఆడతాడని చెబుతాడు.
చెన్నై సూపర్ కింగ్స్ శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 77 పరుగుల తేడాతో విజయం సాధించింది చెన్నై. 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 9 వికెట్లు నష్టపోయి 149 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(89) అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడికి సరైన సహకారం లభించకపోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు భారీ లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ ముందు నిర్దేశించింది. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.