CSK vs DC: ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న చెన్నై.. దిల్లీని చిత్తు చేసిన ధోనీ సేన
CSK vs DC: దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. 77 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ అర్ధశతకం చేసినప్పటికీ తన జట్టుకు విజయం చేకూర్చలేకపోయాడు.
CSK vs DC: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఫలితంగా ఈ ఐపీఎల్ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా గుర్తింపు తెచ్చుకుంది. 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు అందుకున్న చెన్నై.. 17 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంది. 8 విజయాలతో 16 పాయింట్లు రాగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో 17 పాయింట్లు లభించాయి. దిల్లీతో జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 77 పరుగుల తేడాతో గెలిచింది. 224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో దిల్లీ 9 వికెట్లు నష్టపోయి 149 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(89) అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. అతడికి సరైన సహకారం లభించకపోవడంతో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 3 వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ, మహీష ప్రతిరాణ చెరో 2 వికెట్లతో రాణించారు.
224 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దిల్లీ జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. ఓపెనర్ పృథ్వీషాను(5) రెండో ఓవర్లోనే తుషార్ దేశ్‌పాండే ఔట్ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఫిలిప్ సాల్ట్(3), రిలీ రూసో(0) కూడా వెంట వెంటనే ఔట్ కావడంతో 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది దిల్లీ. ఇలాంటి సమయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలకడా రాణించాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. యశ్ ధుల్(13), అక్షర్ పటేల్(15)తో మంచి భాగస్వామ్యాలు నిర్మించినప్పటికీ అతడికి సహచరుల సాయం అందలేదు.
ఈ క్రమంలో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న వార్నర్ వికెట్లు పడుతున్న క్రీజులో పాతుకుపోయాడు. మొత్తం 58 బంతుల్లో 86 పరుగులతో రాణించాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. వరుసగా వికెట్లు కోల్పోతున్న దిల్లీ బ్యాటర్లు.. చివరి ఓవర్ వచ్చేసరికి మరింతగా చేతులెత్తేశారు. మహీష్ తీక్షణ వేసిన ఆ ఓవర్ మెయిడేన్ అయిందంటే ఎంత పేలవ ప్రదర్శన చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఓవర్లో మహీష్ తీక్షణ 2 వికెట్లు తీయడమే కాకుండా పరుగులేమి చేయకుండా అడ్డుకున్నాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో దిల్లీ 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 223 పరుగులు భారీ లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్ ముందు నిర్దేశించింది. రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే అర్ధ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో శివమ్ దూబే, రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించారు. దిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, నోర్జే, చేతన సకారియా తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.