RCB Defeats DC: దిల్లీ వరుసగా ఐదో ఓటమి.. బోణీ కొట్టని వార్నర్ సేన.. బెంగళూరు అద్భుత విజయం
15 April 2023, 19:20 IST
- RCB Defeats DC: దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐపీఎల్ 2023లో ఇంత వరకు బోణీ కొట్టలేదు. వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది. తాజాగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో ఓడిపోయింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దిల్లీ 151 పరుగులకే పరిమితమైంది.
దిల్లీపై ఆర్సీబీ గెలుపు
RCB Defeats DC: దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 20వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో గెలిలిచింది. 175 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన దిల్లీ జట్టు 9 వికెట్ల నష్టపోయి కేవలం 151 పరుగులే చేయగలిగింది. మనీష్ పాండే(50) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ మిగిలిన వారు విఫలం కావడంతో పరాజయం పాలైంది. బెంగళూరు బౌలర్లలో విజయ్ కుమార్ 3 వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. హర్షల్ పటేల్, వానిందు హసరంగా, వేన్ పార్నెల్, తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
175 పరుగుల లక్ష్య ఛేదనంలో దిల్లీ క్యాపిటల్స్‌కు శుభారంభమేమి దక్కలేదు. పరుగుల ఖాతా తెరవకముందే ఓపెనర్ పృథ్వీషా(0) రనౌట్‌గా వెనుదిరిగాడు. తదుపరి ఓవర్లోనే ప్రమాదకర మిషెల్ మార్ష్‌ను(0) పార్నెల్ ఔట్ చేయగా.. స్వల్ప వ్యవధిలోనే యశ్ ధూల్‌ను(1) సిరాజ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది దిల్లీ జట్టు. ఇలాంటి సమయంలో కెప్టెన్ డేవిడ్ వార్నర్(19), మనీష్ పాండేతో కలిసి ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. అయితే వీరి జోడీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. విజయ్ కుమార్ బౌలింగ్‌లో వార్నర్ పెవిలియన్ చేరాడు.
ఫలితంగా పవర్ ప్లే ముగిసే సమయానికి 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది దిల్లీ. అయితే మరోపక్క మనీష్ పాండే అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చివరనిలకడగా రాణించి స్కోరు వేగాన్ని పెంచాడు. ఓ పక్క వికెట్లు కోల్పోతున్నప్పటికీ నిలకడగా రాణించాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 37 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్న మనీష్.. వేగంగా ఆడే ప్రయత్నంలో హసరంగా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. మనీష్ పాండే ఔటైన తర్వాత టెయిలెండర్ల వికెట్లు కూడా త్వరగా పడిపోయాయి.
అయితే చివర్లో హకీమ్ ఖాన్(18), అన్రిచ్ నోర్జే(23) వేగంగా ఆడి దిల్లీ ఓటమి దూరాన్ని తగ్గించారు. ముఖ్యంగా నోర్జే వేగంగా ఆడాడు. ఇరువురు బౌండరీలు బాదుతూ.. దిల్లీ పరువు కాపాడారు. లేకుండా భారీ తేడాతో దిల్లీ ఓటమి పాలయ్యేది. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో దిల్లీ జట్టు 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకు పరిమితమైంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(50) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మిగిలన వారంతా ఓ మోస్తరుగా రాణించారు. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ చెరో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.