RCB vs DC: వేగంగా ప్రారంభించి.. పేలవంగా ముగించారు.. దిల్లీ ముందు బెంగళూరు ఓ మోస్తరు లక్ష్యం
RCB vs DC: చిన్నస్వామి స్టేడియం వేదికగా దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు.
RCB vs DC: దిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 20వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన స్కోరు చేసింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(50) అర్ధశతకం మినహా మిగిలినవారంతా ఓ మోస్తరు స్కోరుకే పరిమితం కావడంతో.. అనుకున్న దానికంటే తక్కువ పరుగులే చేసింది ఆర్సీబీ. మధ్యలో మ్యాక్స్‌వెల్(24) మెరుపులు మెరిపించినప్పటికీ అదే జోరును చివరి వరకు కొనసాగించలేకపోయాడు. దిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మిచెల్ మార్ష్ చెరో 2 వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టుకు మెరుగైన ఆరభం దక్కింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(50), ఫాఫ్ డుప్లెసిస్(22) తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఆరంభంలో దూకుడుగా ఆడి భారీ స్కోరు సాధించేలా పునాదులు వేశారు. అయితే మధ్యలో పదే పదే వికెట్లు కోల్పోయి ఆర్సీబీ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. మిచెల్ మార్ష్.. కెప్టెన్ డుప్లెసిస్‌ను ఔట్ చేయడంతో మొదటి వికెట్ పడింది. అనంతరం వచ్చిన మహిపాల్‌తో(26) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కోహ్లీ.
ఓ పక్క కోహ్లీ వరుస పెట్టి బౌండరీలు బాదగా.. మహిపాల అతడికి చక్కగా సహకరించాడు. వీరిద్దరూ నిలకడైన ప్రదర్శనతో 10 ఓవర్లలో స్కోరును 90కి చేరువ చేశారు. ఇదే క్రమంలో కోహ్లీ అర్ధ సెంచరీని కూడా పూర్తి చేశాడు. 33 బంతుల్లో 50 పరుగులు చేసిన కోహ్లీ దూకుడుగా ఆడే ప్రయత్నంలో లలిత్ యాదవ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద క్యాచ్ వెనుదిరిగాడు. కోహ్లీ ఔటైనప్పటి నుంచి ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. కాసేపు మ్యాక్స్‌వెల్ 3 సిక్సర్లతో మెరుపులు మెరిపించినప్పటికీ దిల్లీ బౌలర్లు వికెట్లే లక్ష్యంగా బౌలింగ్ చేశారు.
కోహ్లీ ఔటైన కాసేపటికే మహిపాల్.. మార్ష్ బౌలింగ్‌లో వెనుదిరగ్గా.. ఆ కాసేపటికే కొత్త బ్యాటర్ హర్షల్ పటేల్(6) కూడా పెవిలియన్ చేరాడు. ఆ తదుపరి ఓవర్లోనే కుల్దీప్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ ఔట్ కాగా.. వెనువెంటనే దినేష్ కార్తిక్(0) కూడా పెవిలియన్ చేరాడు. 15 పరుగుల వ్యవధిలో 4 కీలక వికెట్లు కోల్పోయింది ఆర్సీబీ. అప్పటి నుంచి బెంగళూరు బ్యాటర్లు చాలా నిదానంగా ఆడారు. చివరి ఐదు ఓవర్లలో కేవలం 40 పరుగులు మాత్రమే రాబట్టిగలిగారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగలిగింది బెంగళూరు.