IPL 2022 | దిల్లీ క్యాపిటల్స్‌కు అదనపు బలం.. ఆసీస్ మాజీ ఆటగాడు వాట్సన్ చేరిక
దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో అదనపు బలం చేకూరింది. ఇప్పటికే రికీ పాంటింగ్ ఆ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలందించనుండగా.. షేన్ వాట్సన్ కూడా ఈ జట్టులో భాగమయ్యాడు. దిల్లీ అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఐపీఎల్‌లో ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి జట్టు టైటిల్ విజేతలుగా నిలపడంతో కీలక పాత్ర పోషించాడు. తాజాగా దిల్లీ తరఫున ఐపీఎల్-2022లో కనిపంచనున్నాడు. అయితే ఆటగాడిగా కాదు.. అసిస్టెంట్ కోచ్‌గా. అవును ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా తెలియజేశాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించేందుకు గాను భారత్‌కు వెళ్తున్నానని, ఒకప్పటి సహచరుడు రికీ పాంటింగ్‌తో కలిసి మళ్లీ పనిచేయబోతున్నానని తెలుపుతూ మైక్రో బ్లాగింగ్ సైట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
"దిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేసేందుకు ఈ వారంలో ఇండియా వెళ్లేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నాను. నా సహచరుడు రికీ పాంటింగ్‌తో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ టీ20 టోర్నమెంట్. ఆటగాడిగా ఈ టోర్నీలో నాకు మరపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇప్పుడు కోచింగ్ అవకాశం కూడా వచ్చింది. పాంటింగ్ కింద పనిచేయడాన్ని గొప్పగా భావిస్తున్నాను. అతడు కెప్టెన్‌గా అద్భుతమైన లీడర్. అలాగే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ కోచ్ కూడా అతడే. పాంటింగ్ కింద నేర్చుకునేందుకు తహతహలాడుతున్నాను. దిల్లీ క్యాపిటల్స్ తమ మొదటి టైటిల్ నెగ్గడానికి ఇదే సరైన సమయం. వారికి అత్యుత్తమ జట్టు ఉంది." అని వాట్సన్ వీడియోలో తెలిపాడు.
ఐపీఎల్ ఆరంభ సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ గెలుపులో వాట్సన్ కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రాతినిధ్యం ఆ జట్టు విజయంలో ప్రదాన పాత్ర పోషించాడు. అనంతరం ఆటకు స్వస్తి చెప్పిన ఈ ఆసీస్ విధ్వంసకారుడు.. తాజాగా కోచ్‌గా కొత్త బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 145 మ్యాచ్‌లు ఆడిన వాట్సన్ 3874 పరుగులు చేశాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 92 వికెట్లు పడగొట్టి ఈ లీగ్‌లో అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఐపీఎల్ ప్రస్థానంలో ఇంత వరకు దిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా గెలవలేదు. ఐపీఎల్ 2020లో ఫైనల్ వరకు వెళ్లినా.. టైటిల్ కలను మాత్రం నెరవేర్చుకోలేదు. గతేడాది ప్లే ఆఫ్స్ వరకు చేరుకోగలిగింది. ఈ ఏడాది అయిన టైటిల్ నెగ్గాలని కసితో ఉంది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో తన మొదటి మ్యాచ్‌ను 5 సార్లు విజేతగా నిలిచిన ముంబయిని ఈ నెల 27న ఢీకొట్టనుంది.
టాపిక్