Rohit Sharma Out: ఆ నిర్ణయం సరైనదే.. రోహిత్‌ను ఔటివ్వడంపై స్టార్ స్పోర్ట్స్ వివరణ
11 May 2023, 13:41 IST
- Rohit Sharma Out: ఆ నిర్ణయం సరైనదే అంటూ రోహిత్‌ను ఔటివ్వడంపై స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. మంగళవారం ఆర్సీబీతో మ్యాచ్ లో రోహిత్ ను ఎల్బీడబ్ల్యూగా ఔటివ్వడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.
రోహిత్ శర్మ ఎల్బీడబ్ల్యూపై స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసిన ఫొటో
Rohit Sharma Out: ఐపీఎల్లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ గెలిచినా.. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మను ఎల్బీడబ్ల్యూగా ఔటివ్వడంపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అతడు స్టంప్స్ కు మూడు మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా కూడా థర్డ్ అంపైర్ ఔటిచ్చాడంటూ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. మూడు మీటర్ల నిబంధనను పట్టించుకోకపోవడంపై అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశారు.
అయితే తాజాగా దీనిపై అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది. ఆ సమయంలో రోహిత్ స్టంప్స్ నుంచి 2.9 మీటర్ల దూరంలోనే ఉన్నాడని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఇక బంతి రోహిత్ ప్యాడ్స్ ను తగిలిన సమయంలో అది 38 సెం.మీ. ఎత్తులో ఉందని, స్టంప్స్ ఎత్తు మాత్రం 62 సెం.మీ. అని స్టార్ స్పోర్ట్స్ వివరణ ఇచ్చింది.
నిబంధనల ప్రకారం స్టంప్స్ నుంచి ఓ బ్యాటర్ 3 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే ఎల్బీడబ్ల్యూగా ఇవ్వకూడదు. అయితే ఆ సమయంలో రోహిత్ 3.7 మీటర్ల దూరంలో ఉన్నట్లు మాజీ క్రికెటర్లు మునాఫ్ పటేల్, మహ్మద్ కైఫ్ ఫొటోలు షేర్ చేస్తూ థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దీంతో అభిమానులు కూడా ఈ నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డారు.
నిజానికి రోహిత్ కూడా తనను ఔటివ్వడంపై షాక్ తిన్నాడు. స్టంప్స్ నుంచి చాలా ముందుకు వచ్చి ఆడినా కూడా ఎలా ఔటిచ్చారో అన్నట్లుగా అతడు పెవిలియన్ కు వెళ్లాడు. ఓ బ్యాటర్ స్టంప్స్ నుంచి మూడు మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నప్పుడు ప్యాడ్స్ కు బంతి తగిలితే ఔటివ్వకపోవడానికి ఓ కారణం ఉంది.
మూడు మీటర్ల కంటే ఎక్కువ దూరం బంతి వెళ్లినప్పుడు అది తన గమనాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. దీంతో అది స్టంప్స్ కు తగలకుండా పక్కకు వెళ్తుందన్న ఉద్దేశంతో మూడు మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్నప్పుడు అసలు బాల్ ట్రాకింగ్ ను కూడా చూడాల్సిన అవసరం ఉండదు.