Rohit Sharma: ఆ 3 మీటర్ల రూల్ ఎందుకు పట్టించుకోలేదు.. రోహిత్ ఔట్‌పై మరో వివాదం
Rohit Sharma: ఆ 3 మీటర్ల రూల్ ఎందుకు పట్టించుకోలేదు అంటూ రోహిత్ ఔట్‌పై మరో వివాదం చెలరేగింది. ఆర్సీబీతో మ్యాచ్ లో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ కాగా.. అతడు 3.7 మీటర్ల ముందుకు వచ్చి ఆడినా అంపైర్ పరిగణనలోకి తీసుకోలేదు.
Rohit Sharma: ఐపీఎల్ 2023లో మరోసారి ఎంఐ కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం చెలరేగుతోంది. ఆర్సీబీతో మ్యాచ్ లో అతడు వానిందు హసరంగ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే అతడు క్రీజు నుంచి చాలా ముందుకు వచ్చి ఆడినా కూడా థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అయితే రోహిత్ స్టంప్స్ నుంచి ఏకంగా 3.7 మీటర్ల ముందుకు వచ్చి ఆడినట్లు తేలడంతో ఫ్యాన్స్ ఈ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నారు.
నిజానికి స్టంప్స్ నుంచి మూడు మీటర్ల దూరం ఉంటే నాటౌట్ గా ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు మునాఫ్ పటేల్, మహ్మద్ కైఫ్ కూడా లేవనెత్తారు. తనను ఔట్ గా ప్రకటించిన తర్వాత రోహిత్ కూడా ఇదే విషయంలో షాక్ తిన్నాడు. ఇప్పుడు డీఆర్ఎస్‌పై కూడా డీఆర్ఎస్ అవసరమేమో అని మునాఫ్ అనడం గమనార్హం. మరోవైపు మహ్మద్ కైఫ్ ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. "హలో డీఆర్ఎస్, ఇది కొంచెం ఎక్కువ కాలేదా? ఇది ఎల్బీడబ్ల్యూ ఎలా అవుతుంది?" అని అన్నాడు.
అసలేంటీ 3 మీటర్ల రూల్?
క్రికెట్ లో ఈ మూడు మీటర్ల రూల్ పై గతంలోనూ వివాదం నెలకొంది. ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఈ మూడు మీటర్ల నిబంధనపై చర్చ జరిగింది. ఈ నిబంధన ప్రకారమే నాలుగో టెస్టులో శుభ్‌మన్ గిల్ ను అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. ఓ బ్యాటర్ స్టంప్స్ నుంచి కనీసం మూడు మీటర్ల దూరంలో ఉన్నప్పుడే బాల్ అతని ప్యాడ్స్ ను తగిలితే నాటౌట్ గా ప్రకటించాలన్నది ఈ మూడు మీటర్ల రూల్.
ఆ మూడు మీటర్లలో బంతి తన గమనాన్ని మార్చుకునే అవకాశం ఉండటం వల్ల ఈ నిబంధన పెట్టారు. కానీ తాజా మ్యాచ్ లో థర్డ్ అంపైర్ దీనిని పట్టించుకోకుండా బాల్ ట్రాకింగ్ ద్వారా బంతి వికెట్లను తగులుతుందని తేల్చేసి రోహిత్ శర్మను ఔటిచ్చాడు. ఆ సమయంలో రోహిత్ స్టంప్స్ కు 3.7 మీటర్ల దూరంలో ఉన్నాడు. నిజానికి ఐపీఎల్ ప్లేయింగ్ కండిషన్స్ అపెండిక్స్ డీలోనూ ఈ నిబంధన గురించి స్పష్టంగా ఉంది. అయినా థర్డ్ అంపైర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనం