IPL 2023 playoffs: ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా? డీసీ కూడా రేసులో ఉందా? ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం-ipl 2023 playoffs have a look at how rcb and dc can still qualify ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ipl 2023 Playoffs Have A Look At How Rcb And Dc Can Still Qualify

IPL 2023 playoffs: ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా? డీసీ కూడా రేసులో ఉందా? ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం

Hari Prasad S HT Telugu
May 10, 2023 09:23 AM IST

IPL 2023 playoffs: ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా? డీసీ కూడా రేసులో ఉందా? ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. మంగళవారం (మే 9) ముంబై ఇండియన్స చేతుల్లో ఓడిన తర్వాత ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ముంబై, చెన్నై, డీసీ, ఆర్సీబీ
ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ముంబై, చెన్నై, డీసీ, ఆర్సీబీ (PTI)

IPL 2023 playoffs: ఐపీఎల్లో ప్రతి ఏటా ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగానే ఉంటుంది. ఈసారి కూడా అందుకు భిన్నమేమీ కాదు. ఇప్పటి వరకూ ఏ జట్టు కూడా ఇంకా ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేదు. అయితే పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. మంగళవారం (మే 9) ఆర్సీబీని ఓడించిన ముంబై ఇండియన్స్ తన అవకాశాలను మెరుగుపరచుకోగా.. ఆర్సీబీ ప్రమాదంలో పడింది.

గుజరాత్, లక్నో, రాజస్థాన్ లాంటి జట్లు కూడా ప్లేఆఫ్స్ రేసులో ముందు ఉన్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆర్సీబీకి ఇంకా అవకాశం ఉందా లేదా? డీసీ కూడా ప్లేఆఫ్స్ పై ఇంకా ఆశలు పెట్టుకోవచ్చా? అన్నది మీరే చూడండి.

టాప్ 2పై ముంబై కన్ను

ఈ సీజన్ మొదట్లో వరుస ఓటములతో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. ఈసారి కూడా ప్లేఆఫ్స్ కు దూరమైనట్లే అని అందరూ భావించారు. అయితే ఇప్పుడా టీమ్ ఏకంగా టాప్ 2లోకి చేరే అవకాశం కూడా ఉంది. ఎంఐ తన తర్వాతి మూడు మ్యాచ్ లను కూడా గెలిస్తే టాప్ 2లో ఒకటిగా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్సీబీపై విజయం తర్వాత ముంబై మూడో స్థానానికి చేరింది.

శుక్రవారం (మే 12) గుజరాత్ టైటన్స్ తో, వచ్చే మంగళవారం (మే 16) లక్నో సూపర్ జెయింట్స్ తో, మే 21న సన్ రైజర్స్ హైదరాబాద్ తో ముంబై ఆడనుంది. అయితే ప్రస్తుతం ఆ టీమ్ నెట్ రన్‌రేట్ నెగటివ్ (-0.255)గా ఉండటమే కాస్త ప్రతికూల అంశం. దీనిని మెరుగుపరచుకుంటే ఆ టీమ్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించే అవకాశాలు మెరుగవుతాయి.

ఆర్సీబీకి ఇంకా ఛాన్స్ ఉందా?

ముంబై చేతుల్లో ఓటమితో ఆర్సీబీ తన ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆ టీమ్ తన తర్వాతి మూడు మ్యాచ్ లలో ఒక్కదాంట్లో ఓడినా కష్టమే. అయితే రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తోపాటు డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లు ఆడాల్సి ఉన్న నేపథ్యంలో ఆర్సీబీకి ప్లేఆఫ్స్ అంత సులువైన పనిలా కనిపించడం లేదు. 11 మ్యాచ్ లలో కేవలం 5 గెలిచి, 6 ఓడిపోయి 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది ఆర్సీబీ.

సీఎస్కే పరిస్థితి ఏంటి?

ధోనీ కెప్టెన్సీలోని సీఎస్కేకు ప్లేఆఫ్స్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సీజన్ లో ఆ టీమ్ 11 మ్యాచ్ లలో 13 పాయింట్లు సాధించడంతోపాటు నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా ఉంది. ఇక తన తర్వాతి మూడు మ్యాచ్ లలో రెండు సొంతగడ్డపై ఆడనుండటం కూడా ఆ టీమ్ కు కలిసొచ్చేదే.

ఈ మూడింట్లోనూ ఓడినా కూడా నాలుగో స్థానంతో క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా సీఎస్కేకు ఉండటం విశేషం. డీసీ, కేకేఆర్ లతో చెన్నైలో.. డీసీతో ఢిల్లీలో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.

డీసీ క్వాలిఫై అవుతుందా?

ఈ సీజన్ లో చివరి స్థానంలో ఉన్న టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్. 10 మ్యాచ్ లలో 4 గెలిచి, ఆరు ఓడిపోయింది. అయితే డీసీకి కూడా ప్లేఆఫ్స్ కు వెళ్లే అవకాశం ఉండటం విశేషం.

ఆ టీమ్ మిగిలిన నాలుగు మ్యాచ్ లలోనూ గెలిస్తే 16 పాయింట్లతో నాలుగో స్థానంతో అయినా క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ టీమ్ ఇంకా చెన్నైతో రెండు మ్యాచ్ లు, పంజాబ్ కింగ్స్ తో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. వీటిలో రెండు మ్యాచ్ లు సొంతగడ్డపై ఉన్నాయి.

ఇక పాయింట్ల టేబుల్లో నాలుగు నుంచి ఎనిమిదో స్థానం వరకు ఉన్న లక్నో సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ జట్లు 11 మ్యాచ్ లలో ఐదేసి విజయాలు సాధించాయి. ఈ టీమ్స్ అన్నీ కూడా ఇంకా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతానికి ఏ జట్టూ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించలేదు. అదే సమయంలో మరే జట్టు కూడా ఇంకా రేసు నుంచి తప్పుకోలేదు.

WhatsApp channel

సంబంధిత కథనం