Ravi Shastri on CSK: అందులో ధోనీ ఓ మాస్టర్.. ఈ ఏడాది సీఎస్కే సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పిన రవిశాస్త్రి
10 May 2023, 15:50 IST
- Ravi Shastri on CSK: అదే ధోనీ మ్యాజిక్ అంటే అంటూ ఈ ఏడాది సీఎస్కే సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పాడు రవిశాస్త్రి. గతేడాది దారుణంగా విఫలమైన టీమ్.. 2023లో మళ్లీ ఎలా గాడిలో పడిందో అతడు వివరించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ టీమ్
Ravi Shastri on CSK: ధోనీ సత్తా ఏంటో అందరికీ తెలుసు. వరుస పరాజయాలతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన టీమ్ ను కూడా మళ్లీ ఎలా గాడిలోకి తీసుకురావాలో అతనికి బాగా తెలుసు. ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శనే దానికి నిదర్శనం. ఇదే విషయాన్ని చెబుతూ అసలు ఐపీఎల్ 2023లో సీఎస్కే సక్సెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి.
సీఎస్కే ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో రెండోస్థానంలో ఉంది. ప్లేఆఫ్స్ కు క్రమంగా చేరువవుతోంది. బుధవారం (మే 10) ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో గెలిస్తే సీఎస్కే దాదాపు తన బెర్త్ ఖాయం చేసుకుంటుంది. అయితే చెన్నై సక్సెస్ అంతా ధోనీ చేసిన మ్యాజికే అని, అతనికి సరైన కాంబినేషన్స్ ఎలా చేయాలో తెలుసు అని క్రికిన్ఫోతో మాట్లాడుతూ రవిశాస్త్రి చెప్పాడు.
"కాంబినేషన్ క్రియేట్ చేయడంలో ధోనీ ఓ మాస్టర్. అది అందరికీ తెలిసిందే. 2022లో రాణించని ప్లేయర్స్ ను కూడా వెనుకేసుకు రావడం, 2023లో అతడు బాగా ఆడగలడు అన్న నమ్మకంతో అతన్ని ప్రోత్సహించడం ధోనీ చేస్తుంటాడు. ముందు చూపు అనేది ముఖ్యం. కొంతమంది ప్లేయర్స్ తో ధోనీ ఇదే పని చేసి ఉంటాడు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. నేను వాళ్ల జట్టుతో లేను కాబట్టి కచ్చితంగా తెలియదు" అని రవిశాస్త్రి అన్నాడు.
"అతడు కచ్చితంగా ఇలాగే ఆలోచిస్తాడు. ఇప్పటి జట్టును చూడండి. వాళ్ల టీమ్ కచ్చితంగా ప్లేఆఫ్స్ కు వెళ్తుంది. అంతేకాదు ప్లేఆఫ్స్ లో ఆ టీమ్ చాలా ప్రమాదకరం. అందులోనూ రెండు మ్యాచ్ లు చెన్నైలోనే ఉన్నాయి. టీమ్ బాగా సెటిలైంది. ఏవైనా గాయాలు అయితే తప్ప జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం రాదు" అని రవిశాస్త్రి అన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై 11 మ్యాచ్ లలో ఆరు గెలిచింది. నాలుగు ఓడిపోగా.. ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ప్రస్తుతం 13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. అందులో రెండు సొంతగడ్డపై ఆడనుంది.