IPL 2023: గొడవల్లేవ్.. హ్యాపీగా కలిసిపోయారు.. చెన్నై క్యాంప్‌లో ధోనీ, జడేజా వీడియో వైరల్
24 March 2023, 11:16 IST
IPL 2023: గొడవల్లేవ్.. హ్యాపీగా కలిసిపోయారు.. చెన్నై క్యాంప్‌లో ధోనీ, జడేజా వీడియో వైరల్ అవుతోంది. గతేడాది కెప్టెన్సీ విషయంలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, జడేజా సీఎస్కేను వీడుతున్నాడనీ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
చెన్నై క్యాంపులో సరదాగా జడేజా, ధోనీ
IPL 2023: ఐపీఎల్లో నాలుగుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గతేడాది చేదు అనుభవాలను పక్కన పెట్టి కొత్త సీజన్ ను ఫ్రెష్ గా స్టార్ట్ చేయడానికి ఉత్సాహంగా సిద్ధమవుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గతేడాది చెన్నై టీమ్ ఏకంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీనికితోడు కెప్టెన్సీ మార్పులు.. జడేజా, ధోనీ మధ్య విభేదాలు అనే వార్తలు సీఎస్కే అభిమానులకు ఆందోళన కలిగించాయి.
సీఎస్కే టీమ్ ను జడేజా వీడుతున్నాడనీ గతేడాది వార్తలు వచ్చినా.. అతన్ని రిటెయిన్ చేసుకొని చెన్నై టీమ్ పుకార్లకు చెక్ పెట్టింది. అయినా సరే జడేజా, ధోనీ మధ్య మునుపటి మెరుగైన సంబంధాలు లేవు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. వీటికి కూడా తాజా వీడియోతో చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్ లో ఈ ఇద్దరూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది.
సీఎస్కే టీమ్ తో ధోనీ చాలా రోజుల కిందటే చేరినా.. ఈ మధ్యే జడేజా కూడా ఈ ట్రైనింగ్ క్యాంప్ లో చేరాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అతడు చెన్నై వచ్చాడు. అక్కడి చిదంబరం స్టేడియంలో జరుగుతున్న క్యాంప్ లో ధోనీతో కలిశాడు. చాలా రోజుల తర్వాత ఈ ఇద్దరినీ ఒకచోట చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
మా మధ్య విభేదాలేమీ లేవు.. మేమేమీ పట్టించుకోము అనే అర్థం వచ్చే క్యాప్షన్ తో చెన్నై సూపర్ కింగ్స్ ఈ వీడియోను షేర్ చేసింది. అందులో ట్రైనింగ్ ముగిసిన తర్వాత ధోనీ, జడేజా సరదాగా జోకులేసుకుంటూ, నవ్వుతూ గ్రౌండ్ బయటకు వెళ్లడం చూడొచ్చు. ఇక ఈ మధ్యే ధోనీ అంటే తనకు ఎంత ఇష్టమో కూడా జడేజా చెప్పాడు.
తన కెరీర్ మొత్తం ఇద్దరు మహేంద్రలు చుట్టూ తిరిగిందని, అందులో ఒకరు తన కోచ్ మహేంద్ర సింగ్ చౌహాన్ కాగా.. మరొకరు మహేంద్ర సింగ్ ధోనీ అని అతడు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ వెల్లడించాడు. గతేడాది సీజన్ మొదట్లో కొన్ని మ్యాచ్ ల పాటు సీఎస్కే కెప్టెన్ గా ఉన్నాడు రవీంద్ర జడేజా. అయితే అతని కెప్టెన్సీలో టీమ్ దారుణంగా విఫలమవడంతో మరోసారి ధోనీని కెప్టెన్ చేశారు. తర్వాత గాయం కారణంగా అతడు లీగ్ మధ్యలోనే వెళ్లిపోయాడు.