IPL 2023 Playoffs: పంజాబ్ ఓడినా రేసులోనే.. సన్ రైజర్స్ గెలుపు కోసం చూస్తున్న చెన్నై, లక్నో
18 May 2023, 7:46 IST
- IPL 2023 Playoffs: పంజాబ్ ఓడినా రేసులోనే ఉంది. ఆ మూడు ప్లేఆఫ్స్ స్థానాల కోసం ఇప్పటికీ ఏడు టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఈ సీజన్ ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ తీవ్రమవుతోంది.
పంజాబ్ కింగ్స్ ను ఓడించి సీఎస్కే, ఎల్ఎస్‌జీలను ఖుష్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
IPL 2023 Playoffs: ఐపీఎల్ 2023లో ఇంకా కేవలం ఆరు లీగ్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినా ప్లేఆఫ్స్ లో ఇంకా మూడు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఆ మూడింటి కోసం ఇప్పటికీ ఏడు టీమ్స్ పోటీ పడుతూనే ఉన్నాయి. తాజాగా బుధవారం (మే 17) ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో పంజాబ్ కింగ్స్ ఓడినా కూడా సాంకేతికంగా ఇంకా రేసులోనే ఉండటం విశేషం.
మరోవైపు ఇప్పుడున్న పాయింట్ల(15)తోనే నేరుగా ప్లేఆఫ్స్ కు క్వాలిఫై కావాలంటే ఆర్సీబీని సన్ రైజర్స్ ఓడించాలని కోరుకుంటున్నాయి చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్.
ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ ఇలా..
పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ లు ఆడేసింది. ఆరు విజయాలతో 12 పాయింట్లు, -0.308 నెట్ రన్‌రేట్ తో 8వ స్థానంలో ఉంది. ఇక ఆ టీమ్ చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై గెలవడంతోపాటు ఇతర జట్లు గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. అలా గెలిచినా పంజాబ్ కింగ్స్ 14 పాయింట్లను ఇక మించలేదు. ఇప్పటికే మూడు టీమ్స్ (జీటీ, సీఎస్కే, ఎల్ఎస్‌జీ) 14 పాయింట్ల కంటే ఎక్కువ పాయింట్లతో ఉన్నాయి.
ఆ లెక్కన నాలుగోస్థానం కోసం పంజాబ్ మరో రెండు టీమ్స్ తో పోటీ పడాల్సి ఉంటుంది. అది జరగాలంటే పంజాబ్ గెలవడంతోపాటు ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ తమ తర్వాతి మ్యాచ్ లలో ఓడిపోవాలి. అప్పుడు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ 13 పాయింట్లతో సమానంగా ఉంటాయి.
పంజాబ్ తమ చివరి మ్యాచ్ లో 180 పరుగులు చేస్తే కనీసం 20 పరుగుల తేడాతో గెలవాలి. అదే సమయంలో అంతే లక్ష్యాన్ని చేజ్ చేస్తూ ముంబై 26 పరుగులతో ఓడాలి. దీనివల్ల ముంబై కంటే మెరుగైన నెట రన్‌రేట్ తో పంజాబ్ ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. మిగతా టీమ్స్ కంటే ముందే పంజాబ్ తన చివరి మ్యాచ్ ఆడనుండటంతో సాధ్యమైనంత భారీ విజయం సాధించగలిగితేనే మంచిది.
సన్ రైజర్స్ గెలుపు కోసం ప్రార్థిస్తున్న సీఎస్క్, ఎల్ఎస్‌జీ
ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో పంజాబ్ కింగ్స్ ఓటమి చెన్నై, లక్నో జట్లకు వరమనే చెప్పాలి. ఈ రెండు టీమ్స్ 15 పాయింట్లతో ఉన్నాయి. ఇప్పుడు ముంబై ఇండియన్స్, ఆర్సీబీలు మాత్రమే 16 పాయింట్లకు చేరే ఛాన్స్ ఉంది. ఒకవేళ గురువారం (మే 18) సన్ రైజర్స్ చేతిలో ఆర్సీబీ ఓడిపోతే చెన్నై, లక్నో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించినట్లే. అదే జరిగితే ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ లో ఎలా గెలిచినా ప్లేఆఫ్స్ చేరుతుంది.
సన్ రైజర్స్ చేతుల్లో ఆర్సీబీ ఓడినా.. వాళ్లకు ఇంకా ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది. అది జరగాలంటే ఆర్సీబీ చివరి మ్యాచ్ లో గెలిచి.. ముంబై ఇండియన్స్ తన చివరి మ్యాచ్ ఓడిపోవాలి. అదే సమయంలో రాజస్థాన్ రాయల్స్, నైట్ రైడర్స గెలవాలి. అప్పుడు ఆర్సీబీ, ఆర్ఆర్, కేకేఆర్ 14 పాయింట్లతో ఉంటాయి. వీటిలో ఆర్సీబీ నెట్ రన్‌రేట్ (0.166) వీళ్ల కంటే మెరుగ్గా ఉండటంతో ఆ జట్టుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.