PBKS vs DC: పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలను గల్లంతు చేసిన ఢిల్లీ - లివింగ్‌స్టోన్ మెరుపు ఇన్నింగ్స్ వృథా
18 May 2023, 6:20 IST
PBKS vs DC: ప్లేఆఫ్స్ నుంచి ఔటయిన ఢిల్లీ తనతో పంజాబ్‌ను రేసు నుంచి తప్పించింది. బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్
PBKS vs DC: ఇప్పటికే ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. తనతో పాటు పంజాబ్ కింగ్స్‌కు కూడా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పించింది. బుధవారం పంజాబ్‌కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 15 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.
రూసో 37 బాల్స్‌లో ఆరు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 82 రన్స్ చేసి ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. అతడితో పాటు పృథ్వీషా (38 బాల్స్‌లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్‌తో 54 పరుగులు)హాఫ్ సెంచరీతో మెరవగా... వార్నర్ 46 రన్స్, సాల్ట్ 26 రన్స్ చేశారు. ఢిల్లీ కోల్పోయిన ఈ రెండు వికెట్లను పంజాబ్ కెప్టెన్ సామ్ కరణ్ దక్కించుకోన్నాడు. 214 పరుగుల భారీ లక్ష్యంతో సెకండ్ బ్యాటింగ్ దిగిన పంజాబ్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
రెండో ఓవర్ తొలి బాల్‌కే పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్‌ను ఔట్ చేసి పంజాబ్‌కు షాకిచ్చాడు ఇషాంత్ శర్మ. ప్రభ్‌సిమ్రాన్ కూడా (22 రన్స్) తక్కువ స్కోరుకే ఔట్ కావడంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ తరుణంలో లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే కలిసి పంజాబ్‌ను విజయం దిశగా నడిపించారు.
లివింగ్‌స్టోన్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. 48 బాల్స్‌లోనే తొమ్మిది సిక్సర్లు, ఐదు ఫోర్లతో 94 రన్స్ చేశాడు. అథర్వ 42 బాల్స్‌లో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 55 రన్స్ చేశారు. అథర్వ ఔటైనా చివరి ఓవర్ వరకు లివింగ్‌స్టోన్ పంజాబ్‌ను గెలిపించడానికి విశ్వ ప్రయత్నం చేశాడు.
కానీ మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో అతడి పోరాటం వృథా అయ్యింది. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, నోర్జ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పంజాబ్ 14 పాయింట్లతో ప్లేఆఫ్స్ రేసులో ఉండేది. కానీ ఓటమి కారణంగా దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి లీగ్‌లో మ్యాచ్‌లో భారీ స్కోరుతో గెలవడంతో పాటు మిగిలిన టీమ్‌లో సమీకరణాలపై పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు ఆధారపడ్డాయి. కాగా ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి ఢిల్లీ ఔటయ్యింది