Bhuvaneshwar worst record: పాపం భువనేశ్వర్.. ఇంత చెత్త రికార్డు మరెవరికీ సాధ్యం కాదేమో!
05 May 2023, 12:29 IST
- Bhuvaneshwar worst record: పాపం భువనేశ్వర్.. ఇంత చెత్త రికార్డు మరెవరికీ సాధ్యం కాదేమో. క్రికెట్ లో ఇప్పటి వరకూ మరెవరూ ఊహించని, సాధించని ఓ రికార్డు భువీ సొంతమైంది.
మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కేకేఆర్ ప్లేయర్స్ తో భువనేశ్వర్
Bhuvaneshwar worst record: ఐపీఎల్లో సన్ రైజర్స్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. నిజానికి ఈ రికార్డు మొత్తంగా అతని చెత్త పర్ఫార్మెన్స్ తో వచ్చింది కాదు. తన ప్రమేయం లేకుండా కూడా భువీ ఈ రికార్డులో పాలుపంచుకున్నాడు. ఐపీఎల్లో చేజింగ్ సమయంలో భువనేశ్వర్ బ్యాటింగ్ కు వచ్చిన ఒక్క సందర్భంలోనూ టీమ్ గెలవలేదు.
ఇలా ఒకటీ రెండూ కాదు ఏకంగా 34 మ్యాచ్ లలో సదరు టీమ్ ఓడిపోయింది. ఈ సీజన్ లోనే అలాంటి సందర్భాలు రెండు ఉన్నాయి. ఏ ప్లేయర్ అయినా బరిలోకి దిగే సమయంలో బంతితో అయినా, బ్యాట్ తో అయినా తన టీమ్ ను గెలిపించాలనే అనుకుంటాడు. కానీ భువీ మాత్రం బ్యాట్ తో ఇప్పటికీ ఆ పని చేయలేకపోతున్నాడు. తాజాగా గురువారం (మే 4) కేకేఆర్ తో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ ఓడిపోయిన సమయంలో భువనేశ్వర్ క్రీజులోనే ఉన్నాడు.
ఈ మ్యాచ్ లో చివర్లో బ్యాటింగ్ కు దిగిన భువీ.. 5 బంతుల్లో 5 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. వచ్చీ రాగానే ఫోర్ కొట్టి ఊపు మీద కనిపించినా.. సన్ రైజర్స్ ను మాత్రం గెలిపించలేకపోయాడు. చివరి బంతికి సిక్స్ కొట్టాల్సిన సమయంలో బ్యాటింగ్ చేస్తున్న భువీ.. కనీసం బాల్ ను టచ్ చేయలేకపోయాడు. దీంతో సన్ రైజర్స్ 5 పరుగుల తేడాతో ఓడిపోయారు.
పేస్ బౌలర్ గా సన్ రైజర్స్ కు అతడు ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. తన పేస్, స్వింగ్ తో ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు. కానీ ఆ టీమ్ చేజింగ్ సమయంలో అతడు బ్యాటింగ్ కు దిగిన ప్రతిసారీ సన్ రైజర్స్ ఓడిపోయింది. బహుశా ఇలాంటి రికార్డు మరెవరి పేరిటా లేదు. ఉండాలని కూడా ఎవరూ కోరుకోరు. ఇదే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ ఇలాగే జరిగింది. చివరి ఓవర్లో భువనేశ్వర్ క్రీజులో ఉన్నా.. విజయానికి అవసరమైన పరుగులు చేయకుండా ముకేశ్ కుమార్ అడ్డుకున్నాడు.