IPL 2023 Points Table: నైట్ రైడర్స్ గెలిచినా.. సన్ రైజర్స్ ఓడినా మార్పుల్లేని పాయింట్స్ టేబుల్
IPL 2023 Points Table: నైట్ రైడర్స్ గెలిచినా.. సన్ రైజర్స్ ఓడినా పాయింట్స్ టేబుల్ ఎలాంటి మార్పులూ లేవు. కేకేఆర్ 8వ స్థానంలో, ఎస్ఆర్‌హెచ్ 9వ స్థానంలోనే కొనసాగుతున్నాయి.
IPL 2023 Points Table: నైట్ రైడర్స్ గెలిచారు. సన్ రైజర్స్ ఓడారు. కానీ ఐపీఎల్ 2023 పాయింట్స్ టేబుల్లోగానీ.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ టాప్ 5లోగానీ ఎలాంటి మార్పులూ లేకపోవడం విశేషం. గురువారం (మే 4) జరిగిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ను 5 పరుగుల తేడాతో చిత్తు చేసింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఆ టీమ్ 10 మ్యాచ్ లు ఆడి నాలుగో విజయం సాధించింది.
ప్రస్తుతం 8 పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఇక సన్‌రైజర్స్ మాత్రం 9వ మ్యాచ్ లో ఆరో ఓటమితో 9వ స్థానంలో ఉంది. ఈ రెండు జట్ల నెట్ రన్‌రేట్ కూడా నెగటివ్ గానే ఉంది. ఈ రెండింట్లో ఒక్క టీమ్ ప్లే ఆఫ్స్ కు వెళ్లడం కూడా అసాధ్యంగానే కనిపిస్తోంది. ఇక ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ వరుసగా ఒకటి నుంచి ఏడు స్థానాల వరకు ఉన్నాయి.
రాజస్థాన్, బెంగళూరు, పంజాబ్ టీమ్స్ ఇప్పటి వరకూ 9 మ్యాచ్ లలో ఐదేసి విజయాలు సాధించాయి. అయితే ఈ టీమ్స్ నెట్ రన్‌రేట్ లో మార్పులతో వరుసగా 4, 5, 6 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్ లలో 3 విజయాలు, 6 ఓటములతో అట్టుడుగున ఉంది.
ఆరెంజ్ క్యాప్.. టాప్ 5లో మార్పులేదు
ఇక కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ టాప్ 5లో ఎలాంటి మార్పు లేదు. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు ఇచ్చే ఈ ఆరెంజ్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి 466 పరుగులతో టాప్ లో కొనసాగుతున్నాడు. ఇక యశస్వి జైస్వాల్ (428), డెవోన్ కాన్వే (414), విరాట్ కోహ్లి (364), రుతురాజ్ గైక్వాడ్ (354) టాప్ 5లో ఉన్నారు.
పర్పుల్ క్యాప్ టాప్ 5 వీళ్లే
అటు పర్పుల్ క్యాప్ టాప్ 5లో కూడా ఎలాంటి మార్పులూ లేవు. గుజరాత్ టైటన్స్ బౌలర్ మహ్మద్ షమి 17 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే కూడా 17 వికెట్లతోనే రెండోస్థానంలో కొనసాగుతున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ (16), పీయూష్ చావ్లా (15), మహ్మద్ సిరాజ్ (15) టాప్ 5లో ఉన్నారు.
సంబంధిత కథనం