Arjun Tendulkar Trolling: అర్జున్ టెండూల్కర్‌పై దారుణమైన ట్రోలింగ్.. కారణమేంటో తెలుసా?
19 April 2023, 16:17 IST
- Arjun Tendulkar Trolling: అర్జున్ టెండూల్కర్‌పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లోనే తన తొలి ఐపీఎల్ వికెట్ తీసిన అర్జున్ ను నెటిజన్లు ట్రోల్ చేయడానికి బలమైన కారణమే ఉంది.
అర్జున్ టెండూల్కర్
Arjun Tendulkar Trolling: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడిగా అర్జున్ టెండూల్కర్ పై ఎంతో ఒత్తిడి ఉండటం సహజం. అందులోనూ తన తండ్రి బాటలోనే క్రికెట్ లో అడుగుపెట్టినా.. అతని ఆటలో కనీసం పది శాతమైనా అర్జున్ ఇంకా ఆడలేకపోతున్నాడు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత అతన్ని ముంబై ఇండియన్స్ టీమ్ కొనుగోలు చేసింది.
తర్వాత కూడా రెండేళ్లకుగానీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. ఇక తొలి వికెట్ తీయడానికి రెండో మ్యాచ్ వరకూ వేచి చూడాల్సి వచ్చింది. మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ పై తన తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన అర్జున్ పై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంతో ఒత్తిడిలో చివరి ఓవర్ వేసిన అర్జున్.. ప్రత్యర్థికి 20 పరుగులు అవసరం కాగా.. కేవలం 5 రన్స్ ఇచ్చి వికెట్ తీశాడు.
అయితే ఈ ప్రదర్శనను చూసిన అభిమానులు మెచ్చుకోకపోగా.. అతన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా అతని బౌలింగ్ యాక్షన్, బౌలింగ్ స్పీడు మరీ తక్కువగా ఉండటాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. స్పిన్నర్ షాహిద్ అఫ్రిది కూడా నీ కంటే వేగంగా బౌలింగ్ చేస్తాడంటూ ఓ యూజర్ ట్వీట్ చేయడం విశేషం. ఇక మరో యూజర్ అర్జున్ రనప్ షోయబ్ అక్తర్ లాగా.. స్పీడు డ్వేన్ బ్రావోలాగా ఉందని అన్నాడు.
గంటకు 130 కంటే తక్కువ స్పీడుతో బౌలింగ్ చేస్తున్న వ్యక్తిని ఇంతలా ఎందుకు పొగుడుతున్నారంటూ మరో అభిమాని ప్రశ్నించాడు. మరీ దారుణంగా అర్జున్ ఓ బంతిని 107.2 కి.మీ. వేగంతో వేయడం ఈ ట్రోలింగ్ కు కారణమమైంది. తొలి మ్యాచ్ లో కేకేఆర్ పై 2 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చిన అర్జున్.. రెండో మ్యాచ్ లో 2.5 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.