Sachin on Arjun: అర్జున్ ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్ సచిన్ ఎందుకు చూడలేదో తెలుసా?
Sachin on Arjun: అర్జున్ ఆడిన తొలి ఐపీఎల్ మ్యాచ్ సచిన్ ఎందుకు చూడలేదో తెలుసా? ఈ విషయాన్ని ముంబై, కేకేఆర్ మ్యాచ్ ముగిసిన తర్వాత టెండూల్కరే వివరించాడు.
Sachin on Arjun: మొత్తానికి ఓ ఐపీఎల్ మ్యాచ్ ఆడాలన్న అర్జున్ టెండూల్కర్ కల నెరవేరింది. లెజెండరీ క్రికెటర్ సచిన్ తనయుడే అయినా, అతన్ని ముంబై ఇండియన్స్ టీమ్ ఎప్పుడో టీమ్ లోకి తీసుకున్నా.. ఇన్నాళ్లూ తుది జట్టులో ఆడే అవకాశం మాత్రం అతనికి రాలేదు. కానీ తొలిసారి ఆదివారం (ఏప్రిల్ 16) కేకేఆర్ తో మ్యాచ్ లో అర్జున్ కు ఆడే అవకాశం వచ్చింది.
అయితే తొలి మ్యాచ్ లో అతడు ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. రెండు ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చాడు. వికెట్ తీయలేకపోయాడు. ఇక అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. అయితే తన తనయుడు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నా కూడా ముంబై ఇండియన్స్ క్యాంప్ లోనే ఉన్న తండ్రి సచిన్ టెండూల్కర్ మాత్రం అతడు ఆడుతుంటే చూడలేదట.
అతని చెల్లెలు, సచిన్ కూతురు సారా మాత్రం స్టాండ్స్ లో నుంచి తన అన్నను ఎంకరేజ్ చేసింది. అయితే తాను అర్జున్ ఆటను ఎందుకు చూడలేదో మ్యాచ్ తర్వాత సచిన్ వివరించాడు. అతడు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడాలన్న ఉద్దేశంతోనే తాను అలా చేసినట్లు సచిన్ చెప్పాడు.
"ఇది నాకు కొత్త అనుభవం. ఇప్పటి వరకూ నేనెప్పుడూ వెళ్లి అర్జున్ ఆట చూడలేదు. అతడు ఏం చేయాలనుకుంటే అది స్వేచ్ఛగా చేయాలన్న ఉద్దేశంతో అలా చేశాను. ఇవాళ కూడా నేను వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చున్నాను. అతడు తన ప్లాన్స్ నుంచి దూరం వెళ్లకుండా ఉండాలని, మధ్య మధ్యలో మెగా స్క్రీన్ చూస్తూ తాను చూస్తున్నాను అని ఒత్తిడికి గురి కాకుండా ఉండాలని అలా చేశాను. 2008లో తొలి సీజన్ ఇదే ముంబై ఇండియన్స్ కు నేను ఆడాను. ఇప్పుడు 16 ఏళ్ల తర్వాత అదే టీమ్ కు అర్జున్ ఆడటం ఓ భిన్నమైన అనుభూతి కలిగిస్తోంది" అని సచిన్ చెప్పాడు.
అటు తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అర్జున్ కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు. ముంబై ఇండియన్స్, ఇండియన్ టీమ్ కెప్టెన్ అయిన రోహిత్ నుంచి క్యాప్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అతడు అన్నాడు.
సంబంధిత కథనం