Arjun overcome Sachin: తండ్రిని మించిన తనయుడు.. సచిన్‌కు సాధ్యం కాని మైలురాయి అందుకున్న అర్జున్-arjun tendulkar overcome sachin with maiden wicked in ipl 2023 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Arjun Overcome Sachin: తండ్రిని మించిన తనయుడు.. సచిన్‌కు సాధ్యం కాని మైలురాయి అందుకున్న అర్జున్

Arjun overcome Sachin: తండ్రిని మించిన తనయుడు.. సచిన్‌కు సాధ్యం కాని మైలురాయి అందుకున్న అర్జున్

Maragani Govardhan HT Telugu
Apr 19, 2023 10:32 AM IST

Arjun overcome Sachin: ఐపీఎల్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్‌కు సాధ్యం కాని మైలురాయిని ఆయన కుమారుడు అర్జున్ అందుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో మన మాస్టర్ ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. కానీ అర్జున్ తన రెండో మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించాడు.

ఆ విషయంలో సచిన్‌ను దాటిన అర్జున్ తెందూల్కర్
ఆ విషయంలో సచిన్‌ను దాటిన అర్జున్ తెందూల్కర్ (Mumbai Indians Twitter)

Arjun overcome Sachin: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఆరో స్థానంలో నిలిచిన ముంబయి ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ముఖ్యంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ తనయుడు అర్జున్ తెందూల్కర్‌ ఐపీఎల్‌లో తొలి వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. హైదరాబాద్ విజయానికి ఆఖరు ఓవర్లో 20 పరుగులు అవరసమైన తరుణంలో కేవలం నాలుగే పరుగులిచ్చి ముంబయి సక్సెస్‌లో తన వంతు పాత్ర పోషించాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రి సచిన్ కూడా తన పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ట్విటర్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు.

"మరోసారి సూపర్బ్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. కేమరూన్ గ్రీన్ బ్యాట్, బంతితో రెండింటితోనూ మెరుగ్గా రాణించాడు. ఇషాన్, తిలక్ వర్మ బాగా ఆడారు. ఈ ఐపీఎల్ రోజు రోజుకు మరింత ఆసక్తికరంగా మారింది. కుర్రాళ్లు బాగా ఆడారు. ఎట్టకేలకు ఓ తెందూల్కర్ ఐపీఎల్ వికెట్ సాధించాడు" అని సచిన్ తెలిపాడు.

గాడ్ ఆఫ్ క్రికెట్ అయిన సచిన్ కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా బంతితోనూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో 46 వికెట్లు, వన్డేల్లో 154 వికెట్లు, టీ20ల్లో ఓ వికెట్ తీసిన సచిన్.. ఐపీఎల్‍‌లో మాత్రం ఒక్కకంటే ఒక్క వికెట్ కూడా తీయలేదు. 78 ఐపీఎల్‌లు ఆడిన మన మాస్టర్ నాలుగు ఇన్నింగ్సుల్లో బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ మాత్రం తీయలేకపోయాడు. కానీ సచిన్‌కు అందని ఘనతను అర్జున్ దక్కించుకోవడంతో పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. అందుకే ఓ తెందూల్కర్ ఐపీఎల్ వికెట్ తీసుకున్నాడని తన కుమారుడిని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‍‌‌లో హైదరాబాద్‌పై ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 178 పరుగులకు ఆలౌటైంది. చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు అవసరం కాగా.. బౌలింగ్ చేసిన అర్జున్ తెందూల్కర్ కేవలం 4 పరుగులే ఇచ్చి ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. గత మ్యాచ్ హీరో హ్యారీ బ్రూక్(9), కెప్టెన్ మార్క్‌క్రమ్(22) తక్కువ పరుగులకే ఔట్ కావడంతో మ్యాచ్‌ను కోల్పోయింది హైదరాబాద్. ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లు పియూష్ చావ్లా, రిలే మెరెడెత్, జేసన్ బెహ్రెండార్ఫ్ తలో 2 వికెట్లు తమ ఖాతాలో వేసుకోగా.. అర్జున్ తెందూల్కర్, కెమరూన్ గ్రీన్ చెరో వికెట్ తీశారు.

ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయలతో 6 పాయింట్లు సాధించి మెరుగైన స్థితికి చేరుకుంది. తన తదుపరి మ్యాచ్‌ను ముంబయి ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఏప్రిల్ 22 శనివారం నాడు సాయంత్రం 7.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.

Whats_app_banner