India vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. టీమిండియాలో మూడు మార్పులు!
27 October 2022, 7:49 IST
India vs Netherlands: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో టీమిండియాలో మూడు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. పాకిస్థాన్‌పై గెలవడంతో పసికూన నెదర్లాండ్స్‌పై మిగతా ప్లేయర్స్‌కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో అయినా రోహిత్ గాడిలో పడతాడా
India vs Netherlands: టీ20 వరల్డ్‌కప్‌లో గురువారం (అక్టోబర్ 27) నెదర్లాండ్స్‌తో ఇండియా తలపడనుంది. పాకిస్థాన్‌పై 4 వికెట్లతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన తర్వాత కాన్ఫిడెంట్‌గా ఉన్న ఇండియన్ టీమ్ డచ్ టీమ్‌పై మరింత ఘనంగా గెలవాలని చూస్తోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచినా ఇండియన్ టీమ్‌కు కొన్ని ఆందోళనలను ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది రోహిత్ శర్మ ఫామ్. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా తొలి మ్యాచ్‌లో ఫెయిలయ్యాడు. ఈ ఇద్దరూ క్రీజులో చాలా ఇబ్బందిగా కనిపించారు. రానున్న ముఖ్యమైన మ్యాచ్‌లకు ముందు వీళ్లు ఫామ్‌లోకి రావడం టీమిండియాకు చాలా అవసరం. ఇక ఈ మ్యాచ్‌కు ఇండియన్ టీమ్ తుది జట్టులో మూడు మార్పులు చేసే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడిన అశ్విన్, అక్షర్ పటేల్, దినేష్ కార్తీక్‌ల స్థానంలో దీపక్ హుడా, చహల్, రిషబ్ పంత్‌లను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్టార్ ప్లేయర్స్ రోహిత్, విరాట్, హార్దిక్ పాండ్యాలు మాత్రం ప్రతి మ్యాచ్‌లో ఆడనున్నట్లు ఇప్పటికే బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే స్పష్టం చేశాడు. అటు పేస్ బౌలింగ్ విభాగంలోనూ ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. పాక్‌తో మ్యాచ్ ఆడిన భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్ కొనసాగనున్నారు.
సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లాంటి పెద్ద టీమ్స్‌తో సూపర్ 12 స్టేజ్‌లో ఇంకా మ్యాచ్‌లు మిగిలి ఉన్న దశలో నెదర్లాండ్స్ మ్యాచ్ ఇండియాకు ఎంతో మేలు చేయనుంది. రోహిత్, రాహుల్ గాడిలో పడటానికి, బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించడానికి ఈ మ్యాచ్ ఉపయోగపడుతుంది.
నెదర్లాండ్స్‌తో ఆడే ఇండియా తుది జట్టు అంచనా: రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్, దీపక్ హుడా, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, చహల్, భువనేశ్వర్, షమి, అర్ష్‌దీప్ సింగ్