India vs Netherlands: ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా?
India vs Netherlands: ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? టీ20 వరల్డ్‌కప్‌లో ఇప్పటికే చాలా మ్యాచ్‌లపై వరుణుడు ప్రభావం చూపిస్తున్న వేళ గురువారం (అక్టోబర్ 27) సిడ్నీలో జరగనున్న ఈ మ్యాచ్‌కు వాతావరణం ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
India vs Netherlands: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా గురువారం (అక్టోబర్ 27) ఇండియా, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన తర్వాత భారత అభిమానుల్లో టీమ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. క్రికెట్‌లో పసికూన అయిన నెదర్లాండ్స్‌పై రోహిత్ సేన మరింత ఘనంగా గెలుస్తుందన్న ఆశతో ఈ మ్యాచ్ వైపు చూస్తున్నారు.
అయితే ఇండోపాక్ మ్యాచ్‌కు ముందు వర్షం పడుతుందన్న ఆందోళన ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేసింది. ఆ రోజు మెల్‌బోర్న్‌లో 90 శాతం వర్షం పడే అవకాశం ఉందని ముందు నుంచీ వాతావరణ శాఖ చెప్పడంతో అసలు మ్యాచ్ జరుగుతుందో లేదోనని కోట్లాది మంది అభిమానులు ఆందోళన చెందారు. అయితే అదృష్టవశాత్తూ చుక్క వాన కూడా లేకుండా మ్యాచ్ మొత్తం సజావుగా సాగిపోయింది.
ఇక ఇప్పుడు సిడ్నీలో ఇండియా తన రెండో మ్యాచ్ ఆడబోతున్న సమయంలోనూ అదే సందేహం అభిమానుల్లో ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అంతటా వర్షాలు కురుస్తుండటంతో సిడ్నీలోనూ ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే సిడ్నీలో గురువారం (అక్టోబర్ 27) వర్షం పడే అవకాశాలు తక్కువని వాతావరణ శాఖ వెల్లడించింది.
మెల్‌బోర్న్ మ్యాచ్‌కు ముందు వర్షం ఆందోళనలు ఓ రేంజ్‌లో ఉన్నా.. సిడ్నీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు (మన దగ్గర మధ్యాహ్నం 12.30) ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ సమయంలో 40 శాతం వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వ వాతావరణ శాఖ తెలిపింది.
"ఉదయం వర్షం పడే అవకాశమే లేదు. మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లోనే 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది" అని అక్కడి వాతావరణ శాఖ వెబ్‌సైట్ వెల్లడించింది. అటు ప్రముఖ వాతావరణ అంచనా వెబ్‌సైట్ అక్యూవెదర్ (AccuWeather) అయితే గురువారం మొత్తం అసలు వర్షం పడే అవకాశమే లేదని చెప్పింది. ఇది నిజంగా క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూసే.
ఇప్పటికే ఈ వరల్డ్‌కప్ సూపర్ 12 స్టేజ్‌లో వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. వర్షం వల్ల గెలిచే మ్యాచ్‌లో సౌతాఫ్రికా పాయింట్లు పంచుకోగా.. న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ పూర్తిగా రద్దయింది. ఇక ఇదే వర్షం వల్ల ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ సంచలన విజయం సాధించింది.