T20 World Cup on October 27th: వరల్డ్‌కప్‌లో ట్రిపుల్ ధమాకా.. ఒకే రోజు మూడు మ్యాచ్‌లు
T20 World Cup on October 27th: టీ20 వరల్డ్‌కప్‌లో ఒకే రోజు మూడు మ్యాచ్‌లతో మోత మోగనుంది. గురువారం (అక్టోబర్ 27) ఇండియా, నెదర్లాండ్స్ మ్యాచ్‌తోపాటు మరో రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.
T20 World Cup on October 27th: టీ20 వరల్డ్‌కప్‌లో ట్రిపుల్ ధమాకా క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఒకే రోజు మూడు మ్యాచ్‌లతో క్రికెట్ ఫ్యాన్స్ రోజంతా బిజీగా గడపనున్నారు. ఇందులో ఇండియా మ్యాచ్ కూడా ఉంది. పాకిస్థాన్‌పై తొలి మ్యాచ్ గెలిచిన తర్వాత ఇండియా గురువారం (అక్టోబర్ 27) నెదర్లాండ్స్‌తో తన రెండో మ్యాచ్ ఆడనుంది.
ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమవుతుంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టీమిండియా, నెదర్లాండ్స్ మ్యాచ్ జరగనుంది. దీనికోసం మంగళవారమే ఇండియన్ టీమ్ సిడ్నీలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. పాక్‌పై విజయం తర్వాత సోమవారం దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఇండియన్ స్టార్స్.. మంగళవారం నెట్స్‌లో చెమటోడ్చారు.
పసికూనతో మ్యాచే అయినా.. ఇండియా సీరియస్‌గా తీసుకుంటోంది. ఈ మ్యాచ్‌కు ఎవరికీ రెస్ట్ ఇచ్చే ఉద్దేశం లేదని, పాక్‌తో ఆడిన టీమే బరిలోకి దిగనుందని ఇప్పటికే బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే చెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో అయినా కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో దీపక్ హుడాకు ఛాన్సివ్వాలని గవాస్కర్‌లాంటి మాజీలు సూచిస్తున్నారు.
ఇక వరల్డ్‌కప్‌లో ఇండియా మ్యాచే కాకుండా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్.. పాకిస్థాన్, జింబాబ్వే మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్ సిడ్నీలోనే ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక పెర్త్ ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్, జింబాబ్వే మ్యాచ్ సాయంత్రం 4.30 గంటలకు జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లు సౌతాఫ్రికా, పాకిస్థాన్‌లకు కీలకం కానున్నాయి. జింబాబ్వేపై గెలిచే సమయంలో వర్షం అడ్డుపడి సౌతాఫ్రికా పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. దీంతో బంగ్లాదేశ్‌పై భారీ విజయం సాధించాల్సిన అవసరం సఫారీలకు ఏర్పడింది. అయితే నెదర్లాండ్స్‌పై గెలిచి టీ20 వరల్డ్‌కప్ సూపర్ 12 స్టేజ్‌లో తమ తొలి విజయాన్ని సాధించిన బంగ్లాపై అది అంత సులువు కాదు.
అటు ఇండియా చేతుల్లో ఓడిన పాకిస్థాన్ కూడా జింబాబ్వేపై ఘనంగా గెలవాలన్న పట్టుదలతో ఉంది. చివరి బంతి వరకూ పోరాడి ఓడిపోయిన పాక్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది. సూపర్ 12 స్టేజ్‌లో మరొక్క మ్యాచ్ ఓడినా పాక్ సెమీస్ అవకాశాలు దెబ్బతింటాయి. దీంతో ఆ టీమ్ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది.