SA vs Zim: సౌతాఫ్రికాపై మళ్లీ గెలిచిన వర్షం.. జింబాబ్వేతో మ్యాచ్ రద్దు
SA vs Zim: సౌతాఫ్రికాపై మళ్లీ వర్షమే గెలిచింది. జింబాబ్వేపై విజయానికి చేరువగా వచ్చిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్‌లో ఫలితం తేలకుండానే అంపైర్లు రద్దు చేశారు.
SA vs Zim: సౌతాఫ్రికా టీమ్‌కు, వర్షానికి ఏదో వైరం ఉన్నట్లుంది. 1992 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఆ టీమ్ వర్షం దెబ్బకు ఎలా ఇంటిదారి పట్టిందో అందరికీ తెలిసిందే. గతేడాది కూడా ఇలాగే నాకౌట్స్‌కు చేరలేకపోయింది. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌లోనూ సోమవారం (అక్టోబర్ 24) జింబాబ్వేతో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చిన సమయంలో వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో రెండు టీమ్స్ చెరొక పాయింట్ పంచుకున్నాయి.
హోబర్ట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌కు మొదటి నుంచీ వర్షం అడ్డుపడుతూనే ఉంది. మ్యాచ్ రెండు గంటల 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో అంపైర్లు ఈ మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 9 ఓవర్లలో 5 వికెట్లకు 79 రన్స్ చేసింది. అయితే ఆ తర్వాత మళ్లీ వర్షం కురవడంతో సౌతాఫ్రికా టార్గెట్‌ను 7 ఓవర్లలో 64 రన్స్‌గా నిర్ణయించారు.
చేజింగ్‌ను సౌతాఫ్రికా చాలా స్ట్రాంగ్‌గా మొదలుపెట్టింది. కేవలం 3 ఓవర్లలోనే 51 రన్స్ చేసింది. ఆ టీమ్ ఓపెనర్ క్వింటన్ డికాక్ 18 బాల్స్‌లోనే 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 రన్స్ చేశాడు. అప్పటికే సౌతాఫ్రికా డీఎల్‌ఎస్ స్కోరు కంటే ఎంతో ముందుంది. మరొక్క బాల్ ఆడినా కూడా మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచేదే. అయితే అదే సమయంలో భారీ వర్షం కురవడంతో మళ్లీ మ్యాచ్‌ను నిర్వహించడం సాధ్యం కాదంటూ అంపైర్లను రద్దు చేశారు.
ఈ మ్యాచ్‌లో విజయంతో రెండు పాయింట్లు సులువుగా పొందే వీలున్నా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఒక పాయింట్‌తో సరిపెట్టుకుంది. ఇది ఆ టీమ్ నాకౌట్ అవకాశాలను కూడా ప్రభావితం చేసే వీలుంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఆ టీమ్ ఆడబోయే మ్యాచ్ కీలకం అవుతుంది. ఆ టీమ్‌పై ఓడితే.. సఫారీల అవకాశాలు సంక్లిష్టం అవుతాయి.