IND Vs AUS 3rd T20 : సూర్య, కోహ్లీ విధ్వంసం.. టీ20 సిరీస్ భారత్ కైవసం
25 September 2022, 23:23 IST
- IND Vs AUS : కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ గెలిచింది. కంగారులు భారీ లక్ష్యం నిర్దేశించగా.. సూర్య కుమార్, కోహ్లీ చెలరేగి ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లీ, సూర్య కుమార్
IND Vs AUS 3rd T20 : సొంత గడ్డపై భారత్ చెలరేగి ఆడింది. కంగారులను మట్టి కరిపించింది. మూడో టీ 20 మ్యాచ్ లో ఇండియా గెలిచింది. భారత ఆటగాళ్లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. టాస్ గెలిచిన భారత్ ఫీల్టింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా చేలరేగి ఆడింది. తర్వాత భారత ఆటగాళ్లు బ్యాట్లతో పరుగుల వరద సృష్టించారు.
IND vs AUS: మూడో టీ20లో 6 వికెట్ల తేడాతో గెలిచింది భారత్. ఆస్ట్రేలియా నిర్దేశించిన 187 పరుగులను మరో బంతి మిగిలి ఉండగానే ముగించేసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద పారించాడు. 36 బంతుల్లో 69(5x4, 5x6) పరుగులు చేశాడు. ఇక ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) 48 బంతుల్లో 63(3x4, 4x6) పరుగులు చేశాడు.
మెుదటి మూడు ఓవర్లలో తక్కువ పరుగులే వచ్చాయి. 5 స్కోర్ ఉన్నప్పుడే..కేఎల్ రాహుల్ (1)ను డేనియల్ సామ్స్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్(17) పుంజుకుంటున్నాడు అనే టైమ్ లో ప్యాట్ కమిన్స్ ఔట్ చేశాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిస్టర్ 360 సూర్య బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. వీరిని ఔట్ చేసేందుకు కంగారూలు ఎంతో కంగారు పడాల్సి వచ్చింది. ఏ మాత్రం పట్టించుకోకుండా ఇద్దరూ దూకుడు కొనసాగించారు.
సూర్యకుమార్ సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరేత్తించాడు. 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. జట్టు స్కోరు 134 వద్ద సూర్యను హేజిల్‌వుడ్ ఔట్ చేసేశాడు. ఆ సమయంలో రన్ రేట్ ఎక్కువేమీ లేదు. 17, 18 ఓవర్లలో 12 బంతుల్లో 21గా మారింది. దీంతో అందరిలోనూ టెన్షన్ మెుదలైంది. ఆ టైమ్‌లో హార్దిక్ పాండ్య 16 బంతుల్లో 25(2x4,1x6) పరుగులు చేశాడు. చివరి బంతి బౌండరీకి వెళ్లింది. ఇంకో బాల్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమైంది. డానియల్ సామ్స్ రెండు వికెట్లు తీసుకోగా.. హేజిల్ వుడ్, కమ్మిన్స్ చెరో వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది ఆసీస్. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ కామెరూన్ (52), టిమ్ డేవిడ్ (54) ఇద్దరు అర్ధ శతకాలతో దంచికొట్టారు. ఇంగ్లిస్ (24), డేనియల్ సామ్స్(28) కూడా బాగా ఆడారు. భారత బౌలర్లలో అక్షర్ 3 వికెట్లు తీశాడు. భువీ, చాహల్, హర్షల్ తలో వికెట్ తీశారు.