Ind vs Pak: హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో.. పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా-hardik stars as india defeated pakistan by 5 wickets in their asia cup match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak: హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో.. పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా

Ind vs Pak: హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో.. పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా

Hari Prasad S HT Telugu
Aug 28, 2022 11:55 PM IST

Ind vs Pak: ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది టీమిండియా. హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ మెరుపులు.. జడేజా, కోహ్లి బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో 148 రన్స్‌ టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి ఇండియా చేజ్‌ చేసింది. ఈ గెలుపుతో గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

<p>సూపర్ మ్యాన్ హార్దిక్ పాండ్యా.. 3 వికెట్లు 33 రన్స్</p>
సూపర్ మ్యాన్ హార్దిక్ పాండ్యా.. 3 వికెట్లు 33 రన్స్ (AFP)

వాహ్‌.. చాలా రోజుల తర్వాత ఇండియా, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌లోని అసలైన మజా ఏంటో అభిమానులకు తెలిసొచ్చింది. చివరి ఓవర్‌ వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఆసియా కప్‌ మ్యాచ్‌లో ఇండియా చివరికి 5 వికెట్లతో గెలిచింది. 148 రన్స్‌ టార్గెట్‌ను మరో 2 బాల్స్ మిగిలి ఉండగా చేజ్‌ చేసింది. చివరి 3 బాల్స్‌లో 6 రన్స్‌ అవసరం కాగా.. హార్దిక్‌ పాండ్యా సిక్స్‌తో తనదైన స్టైల్లో మ్యాచ్‌ను ముగించాడు.

హార్దిక్‌ 3 వికెట్లతోపాటు బ్యాటింగ్‌లో చివరి వరకూ ఉండి కేవలం 17 బాల్స్‌లో 33 రన్స్‌ చేయడం విశేషం. అతనికి తోడు జడేజా (35), విరాట్ కోహ్లి (35) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడారు. అయితే ఈ మ్యాచ్‌ మాత్రం అభిమానులకు మంచి థ్రిల్‌ అందించింది. విజయానికి చివరి రెండు ఓవర్లలో 21 రన్స్‌ అవసరం కాగా.. 19వ ఓవర్లో హార్దిక్‌ మూడు ఫోర్లు బాదాడు.

దీంతో చివరి ఓవర్లో 7 రన్స్‌ అవసరం అయ్యాయి. అయితే తొలి బంతికే జడేజా ఔట్‌ కావడం.. తర్వాతి రెండు బంతులకు కేవలం ఒకే పరుగు రావడంతో ఉత్కంఠ పెరిగింది. అయితే నాలుగో బంతికి హార్దిక్‌ సిక్స్‌ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. టీ20ల్లో పాకిస్థాన్‌పై ఇండియాకు ఇది 8వ విజయం.148 రన్స్‌ చేజింగ్‌లో ఇండియాకు తొలి ఓవర్లోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తొలి బాల్‌కే డకౌటయ్యాడు. ఆ తర్వాత సీనియర్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి విలువైన పార్ట్‌నర్‌షిప్‌ నెలకొల్పారు. ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. ఓవైపు రోహిత్ ఆడటానికి ఇబ్బంది పడుతున్నా.. చాలా రోజుల తర్వాత విరాట్‌ తనదైన స్టైల్లో ఆడాడు.

ఇద్దరూ రెండో వికెట్‌కు 49 రన్స్‌ జోడించారు. ఈ క్రమంలో ఒక సిక్స్‌ కొట్టి మెల్లగా ఫామ్‌లోకి వస్తున్నట్లు కనిపించిన రోహిత్‌ (12) ఔటయ్యాడు. ఆ కాసేపటికే మంచి ఫామ్‌లో కనిపించిన విరాట్‌ కోహ్లి (35) కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో ఇండియా 53 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌పై నాలుగో స్థానంలో వచ్చిన జడేజా, సూర్యకుమార్‌ నాలుగో వికెట్‌కు 36 రన్స్‌ జోడించారు. ఆ తర్వాత సూర్య కూడా 18 రన్స్‌ చేసి ఔటయ్యాడు.

చెలరేగిన భువీ, హార్దిక్

అంతకుముందు పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ 42 బాల్స్‌లో 43 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతడు ఒక్కడే కాస్త భయపెట్టినా.. మిడిల్‌ ఓవర్లలో హార్దిక్‌ పాండ్యా, చివరి ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ చెలరేగి పాక్‌ ను దెబ్బతీశారు. దీంతో ఆ టీమ్‌ భారీ స్కోరు చేయలేకపోయింది. భువనేశ్వర్ 4 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్ పై ఓ ఇండియన్ బౌలర్ కు టీ20ల్లో ఇవే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కావడం విశేషం.

హార్దిక్‌ పాండ్యా 4 ఓవర్లలో 25 రన్స్‌ 3 వికెట్లు తీశాడు. షార్ట్‌ బాల్స్‌తో పాక్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు హార్దిక్‌ పాండ్యా. అతడు తీసిన మూడు వికెట్లు షార్ట్‌ పిచ్‌ బాల్స్‌తోనే కావడం విశేషం. డేంజరస్‌ రిజ్వాన్‌ వికెట్‌ను కూడా ఇలాంటి బాల్‌తోనే బోల్తా కొట్టించాడు. అటు స్ట్రైకర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కూడా రాణించాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను తొలి ఓవర్లోనే భయపెట్టాడు భువనేశ్వర్‌. రెండుసార్లు రివ్యూలతో బతికిపోయాడు ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌. ఆ తర్వాత స్కోరు 15 రన్స్‌ చేరేసరికి కెప్టెన్‌ బాబర్‌ ఆజం (10)ను షార్ట్‌ బాల్‌తో భువీయే ఔట్‌ చేశాడు. ఆ తర్వాత ఫఖర్‌ జమాన్‌ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్‌ అహ్మద్‌ (28) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.

ఇద్దరూ కలిసి భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఈ సమయంలో పాక్‌ ఫ్యాన్స్‌ మంచి ఊపు మీద కనిపించారు. ఈ సమయంలో బౌలింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా పాక్‌ను దెబ్బ తీశాడు. ఇఫ్తికార్‌ అహ్మద్‌, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ రిజ్వాన్‌లను అతడు ఔట్‌ చేశాడు. దీంతో పాక్‌ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది.

Whats_app_banner