KL Rahul on Strike Rate: నా స్ట్రైక్‌ రేట్‌ పెంచుకోవడంపై దృష్టిసారిస్తున్నా: కేఎల్‌ రాహుల్‌-kl rahul reacted on his strike rate criticism ahead of series against australia ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kl Rahul Reacted On His Strike Rate Criticism Ahead Of Series Against Australia

KL Rahul on Strike Rate: నా స్ట్రైక్‌ రేట్‌ పెంచుకోవడంపై దృష్టిసారిస్తున్నా: కేఎల్‌ రాహుల్‌

Hari Prasad S HT Telugu
Sep 19, 2022 07:10 PM IST

KL Rahul on Strike Rate: తన స్ట్రైక్‌ రేట్‌ పెంచుకోవడంపై దృష్టిసారిస్తున్నట్లు టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ చెప్పాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం (సెప్టెంబర్‌ 20) తొలి టీ20 జరగనున్న నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడాడు.

స్ట్రైక్ రేట్ విషయంలో కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్
స్ట్రైక్ రేట్ విషయంలో కొంతకాలంగా విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ (Getty)

KL Rahul on Strike Rate: ఇండియన్‌ టీమ్‌లో కేఎల్‌ రాహుల్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిలతో కలిసి టీమ్‌ టాపార్డర్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే కొంతకాలంగా టీ20ల్లో అతని స్ట్రైక్‌రేట్‌పై పెద్ద చర్చే నడుస్తోంది. అతని స్లో బ్యాటింగ్‌ కొన్నిసార్లు టీమ్ కొంప ముంచుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్‌లో రాహుల్‌ నిలకడగా ఆడినా.. స్ట్రైక్‌ రేట్‌ విషయంలోనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆసియా కప్‌లోనూ అదే పరిస్థితి. 2021, జనవరి తర్వాత అతని స్ట్రైక్‌ రేట్‌ 127.96గా ఉంది. ఇది మరీ అంత చెత్త స్ట్రైక్‌రేట్‌ ఏమీ కాకపోయినా.. అతని నుంచి మరింత వేగంగా రన్స్‌ ఆశిస్తున్నారు. ఇప్పుడు మంగళవారం (సెప్టెంబర్‌ 20) ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి రాహుల్‌ స్ట్రైక్‌రేట్‌పై చర్చ జరుగుతుండగా.. అతడు దీనిపై స్పందించాడు.

స్ట్రైక్‌రేట్‌ పెంచుకునే పనిలో ఉన్నా

"ఎవరూ పర్ఫెక్ట్‌ కాదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఎవరూ పర్ఫెక్ట్‌ కాదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక అంశంపై దృష్టిసారిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఒక్కో పని చేయాల్సి ఉంది. స్ట్రైక్‌రేట్లను ఓవరాల్‌గా చూస్తారు. ఓ బ్యాట్స్‌మన్‌ 200 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేసినప్పుడు లేదంటే 100-120 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసినా టీమ్‌ గెలిచినప్పుడు ఆ బ్యాటర్‌ స్ట్రైక్‌రేట్‌ను పెద్దగా పట్టించుకోరు. అందుకే ఈ విషయాలను అందరూ విశ్లేషించలేరు. అందుకే మీరు నా స్ట్రైక్‌ రేట్‌ చూసినప్పుడు తక్కువగా అనిపిస్తుంది" అని రాహుల్‌ చెప్పుకొచ్చాడు.

అయితే తాను దీనిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. "దీనిపై నేను దృష్టి సారించాను. గత 10 -12 నెలలుగా ప్రతి ప్లేయర్‌కు వాళ్ల రోల్‌ ఏంటో స్పష్టంగా చెప్పారు. సదరు ప్లేయర్‌కు కూడా తన నుంచి ఏమి ఆశిస్తున్నారో తెలుసు. అందరూ ఆ దిశగానే పని చేస్తున్నారు" అని రాహుల్‌ అన్నాడు. గాయం నుంచి కోలుకొని మళ్లీ టీమ్‌లోకి వచ్చిన తర్వాత రాహుల్‌లో మునుపటి జోరు కనిపించడం లేదు.

తాను పూర్తిగా ఫిట్‌గా ఉన్నానని నమ్మడానికి కొన్ని మ్యాచ్‌ల సమయం పట్టిందని ఈ సందర్భంగా రాహుల్‌ చెప్పాడు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని, ఆసియా కప్‌, జింబాబ్వే టూర్‌లు ఆ దిశగా సాయం చేసినట్లు తెలిపాడు. ఇప్పుడు సొంతగడ్డపై ఆడనుండటం సరదాగా ఉండనుందని అన్నాడు. ఇక ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ వైఫల్యంపై వస్తున్న విమర్శలపైనా రాహుల్‌ స్పందించాడు.

ఆత్మ విమర్శ చేసుకుంటాం

"ఓ ప్లేయర్‌కు తన కెప్టెన్‌, కోచ్‌, ఇతర ప్లేయర్స్‌ తన గురంచి ఏమనుకుంటారన్నది ముఖ్యం. ప్లేయర్‌కు మాత్రమే తన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలుస్తుంది. అందరూ బెస్ట్‌గా ఆడటానికే ప్రయత్నిస్తున్నారు. ఓ ప్లేయర్‌ ప్రతిసారీ సక్సెస్‌ కాలేడు.

విమర్శలు సహజమే. అందరి కంటే కూడా మేము ఆత్మ విమర్శ ఎక్కువగా చేసుకుంటాం. గెలవాలనే కలలు కంటాం. దేశానికి ఆడుతున్నాం. వరల్డ్‌కప్‌ గెలవాలన్నదే మా లక్ష్యం. మేము బాగా ఆడనప్పుడు మాకే ఎక్కువ బాధ కలుగుతుంది" అని రాహుల్‌ స్పష్టం చేశాడు.

WhatsApp channel