India vs Australia 1st Test: షాకింగ్.. సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం.. శుభ్‌మన్ గిల్‌కు నో ఛాన్స్
09 February 2023, 9:31 IST
- India vs Australia 1st Test: షాకింగ్ నిర్ణయం తీసుకుంది టీమిండియా మేనేజ్‌మెంట్. సూర్యకుమార్ టెస్ట్ అరంగేట్రం చేస్తుండగా.. టాప్ ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు మాత్రం అవకాశం దక్కకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది.
సూర్యకుమార్ యాదవ్
India vs Australia 1st Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తుది జట్టు ఎంపిక మరోసారి ఆశ్చర్యానికి, అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఏడాది కాలంగా టాప్ ఫామ్ లో ఉన్న శుభ్‌మన్ గిల్ ను కాదని తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్ కు చోటిచ్చారు. ఇప్పటికే 13 టెస్టుల అనుభవం ఉండి.. మంచి ఫామ్ లో ఉన్న గిల్ ను పక్కనపెట్టడం ఏంటని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు టీ20ల్లో మంచి బ్యాటరే అయినా.. సూర్యకు ఇదే తొలి టెస్టు. ఈ కీలకమైన మ్యాచ్ లో అతనికి ఛాన్సివ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గిల్ లేకపోవడంతో కెప్టెన్ రోహిత్ తో కలిసి వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఇక సూర్య ఐదో స్థానంలో బ్యాటింగ్ కు రానున్నాడు. 32 ఏళ్ల సూర్య టెస్టు ఆడాలన్న కల మొత్తానికి నెరవేరింది.
ఇండియన్ టీమ్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 304వ క్రికెటర్ గా సూర్య నిలిచాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్ కు అనుకూలిస్తుందని భావిస్తున్న ఈ పిచ్ పై ఊహించినట్లే ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది టీమిండియా. అశ్విన్, జడేజాతోపాటు అక్షర్ పటేల్ కు అవకాశం ఇచ్చింది.
ఆంధ్రా వికెట్ కీపర్ కేఎస్ భరత్ కూడా ఇదే మ్యాచ్ తో టెస్టు అరంగేట్రం చేస్తున్నాడు. రిషబ్ పంత్ ప్రమాదానికి గురి కావడంతో టెస్టుల్లో భరత్ కు అవకాశం దక్కింది. ఇక పేస్ బౌలింగ్ భారాన్ని సిరాజ్, షమి మోయనున్నారు. తొలి టెస్టు ప్రారంభానికి ముందే నాగ్‌పూర్ పిచ్ పై పెద్ద రచ్చ జరగడంతో ఇప్పుడు మ్యాచ్ లో ఈ పిచ్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇండియా తుది జట్టు ఇదే
రోహిత్, రాహుల్, పుజారా, కోహ్లి, సూర్యకుమార్, భరత్, అశ్విన్, జడేజా, అక్షర్, సిరాజ్, షమి
ఆస్ట్రేలియా తుది జట్టు ఇదే
డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవ్ స్మిత్, మ్యాట్ రెన్షా, పీటర్ హ్యాండ్స్‌కాంబ్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, నేథన్ లయన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్