KL Rahul on India vs Australia: ఏ స్థానంలో ఆడటానికైనా రెడీ.. ముగ్గురు స్పిన్నర్లతో ఆడతాం: కేఎల్ రాహుల్
KL Rahul on India vs Australia: ఏ స్థానంలో ఆడటానికైనా రెడీ అన్నాడు టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్. ఇక ఆస్ట్రేలియతో తొలి టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉందని కూడా అతడు చెప్పాడు.
KL Rahul on India vs Australia: టెస్ట్ క్రికెట్ లో మరో రసవత్తర సమరానికి సమయం దగ్గర పడింది. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరగబోయే నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ గురువారం (ఫిబ్రవరి 9) నుంచి ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ లో జరగబోయే ఈ మ్యాచ్ కు ఇండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది? తాను ఏ స్థానంలో ఆడతాడన్నదానిపై వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పష్టత ఇచ్చాడు.
ట్రెండింగ్ వార్తలు
మంగళవారం (ఫిబ్రవరి 7) మీడియాతో అతడు మాట్లాడాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు పిచ్ లు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ప్రధానంగా జరుగుతోంది. దీంతో రాహుల్ కూడా ఈ అంశంపై స్పందించాడు. అంతేకాదు పిచ్ ను బట్టి టీమ్ ఎంపిక ఉంటుందని చెప్పాడు.
ముగ్గురు స్పిన్నర్లు ఉంటారా?
తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు ఉంటారా అన్న చర్చ నేపథ్యంలో రాహుల్ పిచ్ గురించి స్పందించాడు. "మేము పిచ్ చూశాం. కానీ పిచ్ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. మ్యాచ్ రోజు వచ్చి చూస్తేనే తెలుస్తుంది" అని రాహుల్ అన్నాడు. "పిచ్ చూసిన తర్వాత ఇలా వ్యవహరిస్తుంది అని ఓ అంచనాకు రావచ్చు.
కానీ పిచ్ లు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం. ముగ్గురు స్పిన్నర్లు ఆడించాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియాలో ఆడుతున్నాం. మ్యాచ్ రోజే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం" అని రాహుల్ స్పష్టం చేశాడు.
మిడిలార్డర్‌లో అయినా ఆడతా
ఇక శుభ్‌మన్ గిల్ రూపంలో ఓపెనింగ్ స్థానానికి పోటీ ఉండటంతో రాహుల్ తాను మిడిలార్డర్ లో ఆడటానికి కూడా సిద్ధమే అని చెప్పాడు. "తుది జట్టుపై ఇంకా ఏమీ నిర్ణయించలేదు. ఈ నిర్ణయం కాస్త కష్టమైనదే. కొందరు ప్లేయర్స్ అద్భుతంగా ఆడారు. కొన్ని స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
దీనిపై చర్చలు కొనసాగుతున్నాయి. టీమ్ కోరితే నేను మిడిలార్డర్ లో రావడానికి కూడా సిద్ధమే" అని రాహుల్ స్పష్టం చేశాడు. "ఆ పరిస్థితి వస్తే చేయడానికి నాకు సంతోషమే. దేశం కోసం ఆడినప్పుడల్లా నేను అదే చేశాను. టీమ్ ఏది అడిగితే అది చేయడానికి సిద్ధం" అని రాహుల్ అన్నాడు.