Suryakumar ahead of Pujara: పుజారాకు బదులు సూర్యకుమార్? మాజీ సెలక్టర్‌పై నెటిజన్లు ట్రోల్
08 February 2023, 8:55 IST
- Suryakumar ahead of Pujara: ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు పుజారాకు బదులు సూర్యకుమార్ యాదవ్‌ను తీసుకోవాలని మాజీ సెలక్టర్ సునీల్ జోషీ ట్విటర్ వేదికగా తెలిపారు. దీంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పుజారా-సూర్యకుమార్ యాదవ్
Suryakumar ahead of Pujara: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. దీంతో సీనియర్లు, మాజీలు, అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఆత్రుతగా చూస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో తుదిజట్టులో ఎవర్నీ తీసుకుంటారనేది ఉత్కంఠను కలిగిస్తోంది. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ సెలక్టర్ సునీల్ జోషీ ట్విటర్ వేదికగా నెటిజన్ల ట్రోల్స్‌కు గురవుతున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఆ.న తన జట్టులో ఛతేశ్వర్ పుజారా స్థానంలో సూర్యకుమార్‌ను ఎంపిక చేయడమే ఇందుకు కారణం.
టెస్టు క్రికెట్‌లో పుజారా స్థానం తప్పనిసరిగా ఉంటుంది. చాలా కాలంగా నిలకడగా రాణిస్తున్న అతడు.. ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. గతేడాది డిసెంబరు బంగ్లాదేశ్‌పై అద్భుత శతకం కూడా సాధించాడు. అంతేకాకుండా అతడు కెరీర్‌లో వందో టెస్టు ఆడబోతున్నాడు. ఇలాంటి సమయంలో పుజారాను తుది జట్టులోకి తీసుకోవద్దని పరోక్షంగా చెప్పడం సునీల్ జోషీపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
"తొలి టెస్టులో భారత్ ఈ లైనప్‌లోనే ఉంటుందా? పుజారా-సూర్యకుమార్ మధ్య చర్చ ఉంటుంది, కుల్దీప్ యాదవ్-అక్షర్ మధ్య కూడా కఠినమైన డ్రా ఉంటుంది. ఇదిగో నా జట్టు. రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్య, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, షమీ, సిరాజ్." అంటూ తన జట్టులో పుజారా పేరును ప్రస్తావించలేదు సునీల్ జోషి.
దీంతో సునీల్ జోషీ జట్టు ఎంపికపై ఆయనపై తీవ్రంగా అభిమానులు తీవ్రంగా విమర్శలు సంధిస్తున్నారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ కూడా స్పందించారు. టెస్టు క్రికెట్‌లో పుజారా స్థానంలో అరంగేట్ర ఆటగాడిని తీసుకోవడంపై సెలక్టర్ ధైర్యాన్ని ప్రశ్నించారు.
"టెస్టులకు పుజారాకు బదులు సూర్యను ఎంపిక చేయాలని మాజీ సెలక్టర్ ఒకరు కోరుతున్నారు. ఆ విషయాన్ని మర్చిపోంది. నా ఉద్దేశం, పుజారా స్థానంలో ఇంతవరకు టెస్టు ఆడని వ్యక్తి జట్టులో తీసుకోవచ్చనే ధైర్యం నా మనస్సును కదిలించింది. పాపం పుజారా తన జీవితమంతా బలిపశువుగా మారడంలో ఆశ్చర్యమేమి లేదు." అని దొడ్డగణేష్ తెలిపారు.