India vs Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో కోహ్లి vs నవీన్ లేనట్లే.. రోహిత్, విరాట్, షమిలకు రెస్ట్
26 May 2023, 10:43 IST
- India vs Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్‌లో కోహ్లి vs నవీన్ లేనట్లే. స్వదేశంలో జరగబోయే ఈ సిరీస్ కు రోహిత్, విరాట్, షమిలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉంది.
ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ కు రోహిత్, కోహ్లికు రెస్ట్
India vs Afghanistan: ఇండియా, ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ లో విరాట్ కోహ్లి వర్సెస్ నవీనుల్ హక్ చూసే అవకాశం అభిమానులకు కలిగేలా లేదు. ఆ జట్టుతో సొంతగడ్డపై జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్ లకు రెస్ట్ ఇవ్వాలని బోర్డు భావిస్తున్నట్లు పీటీఐ తన రిపోర్టులో వెల్లడించింది.
నిజానికి ఇండియా బిజీ షెడ్యూల్లో ఈ ఆప్ఘనిస్థాన్ సిరీస్ అసలు జరుగుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. అయితే బీసీసీఐ మాత్రం సెకండ్ రేట్ జట్టుతో అయినా సిరీస్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ సెకండ్ రేట్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సిరీస్ ఎప్పుడు జరుగుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
అయితే జూన్ మూడు లేదా నాలుగో వారంలో ఆప్ఘనిస్థాన్ తో మూడు వన్డేల సిరీస్ జరగొచ్చు. ఆ వెంటనే ఇండియన్ టీమ్ వెస్టిండీస్ టూర్ కు వెళ్లాల్సి ఉంది. దీంతో రోహిత్, విరాట్, షమిలపై పని భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఆఫ్ఘన్ సిరీస్ నుంచి వాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నారు. చాలా వరకూ ఇండియన్ ప్లేయర్స్ రెండు నెలలుగా ఐపీఎల్లో ఆడుతున్నారు.
అందులో కొందరు జూన్ 7 నుంచి ప్రారంభం కాబోయే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడబోతున్నారు. జులైతో వెస్టిండీస్ లో పూర్తిస్థాయి పర్యటన కోసం వెళ్లాల్సి ఉంది. అందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనున్నారు. ఈ సిరీస్ జులై 12 నుంచి ఆగస్ట్ 13 వరకూ జరుగుతుంది. ఆ తర్వాత ఐర్లాండ్ లో మరో మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
దీంతో సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలంటే కేవలం ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ లోనే సాధ్యం. ఒకవేళ వాళ్లను పక్కన పెట్టాలనుకుంటే ఐపీఎల్ స్టార్లు యశస్వి, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ లకు జట్టులో చోటు దక్కే వీలుంటుంది. ఇక ఆ తర్వాత ఆసియా కప్ కూడా ఉండటంతో ఐర్లాండ్ సిరీస్ కు కూడా రోహిత్, విరాట్, హార్దిక్ లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.