Afghanistan vs Australia: తాలిబన్లు మహిళలు, బాలికలపై ఆంక్షలు విధిస్తున్నారంటూ ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ ఆడటానికి నిరాకరించింది ఆస్ట్రేలియా. మార్చిలో జరగాల్సిన ఈ సిరీస్‌ను రద్దు చేసుకుంది. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంపై ఆఫ్ఘన్ పేస్‌బౌలర్ నవీనుల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో తాను ఆడబోనని చెప్పడం గమనార్హం.
నవీన్ సిడ్నీ సిక్సర్స్ టీమ్‌కు ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు కూడా తీశాడు. "ఇక బిగ్ బాష్ లీగ్‌లో ఆడబోనని చెప్పే సమయం ఇది. ఇలాంటి చిన్న పిల్లల నిర్ణయాలు తీసుకోవడం ఆపనంత వరకూ నేను ఆడను. గతంలో ఒక టెస్ట్ విషయంలో, ఇప్పుడు వన్డే సిరీస్ విషయంలో అలాగే చేశారు. ఓ దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మద్దతుగా ఉండాల్సింది పోయి క్రికెట్ అనే ఆ ఒక్క సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నారు" అని నవీనుల్ హక్ ట్వీట్ చేశాడు.
అంతకుముందు గురువారం (జనవరి 12) ఉదయం ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఆఫ్ఘనిస్థాన్‌తో మార్చిలో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను రద్దు చేసుకుంది. అక్కడి తాలిబన్ ప్రభుత్వం మహిళల, బాలికల విద్య, ఉద్యోగాలపై ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రకటనను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సిరీస్ రద్దు గురించి వెల్లడించింది.
ఈ సిరీస్ ద్వారా ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్లు వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ ఆడబోమని చెప్పడంతో మొత్తం 30 పాయింట్లు ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లనున్నాయి. తాము ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల, మహిళల క్రికెట్ వృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
సంబంధిత కథనం