Afghanistan vs Australia: తాలిబన్ ఎఫెక్ట్.. ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా
Afghanistan vs Australia: తాలిబన్ ఎఫెక్ట్‌తో ఆఫ్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్ రద్దు చేసుకుంది ఆస్ట్రేలియా. ఈ సిరీస్ యూఏఈలో జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఆస్ట్రేలియా తప్పుకోవడంతో ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్లన్నీ ఆఫ్ఘన్ టీమ్‌కు వెళ్లనున్నాయి.
Afghanistan vs Australia: ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ ఆఫ్ఘనిస్థాన్‌తో మార్చిలో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్‌ను రద్దు చేసుకుంది. అక్కడి తాలిబన్ ప్రభుత్వం మహిళల, బాలికల విద్య, ఉద్యోగాలపై ఆంక్షలు విధిస్తూ చేసిన ప్రకటనను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సిరీస్ రద్దు గురించి వెల్లడించింది.
ఈ సిరీస్ ద్వారా ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్లు వచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ ఆడబోమని చెప్పడంతో మొత్తం 30 పాయింట్లు ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లనున్నాయి. తాము ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా తమ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన జారీ చేసింది. ఆఫ్ఘనిస్థాన్ సహా ప్రపంచవ్యాప్తంగా పురుషుల, మహిళల క్రికెట్ వృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల, బాలికల పరిస్థితులు మెరుగవుతాయన్న ఉద్దేశంతో తాము ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతూనే ఉంటామని చెప్పింది. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయని, వీటిపై మార్చిలో జరగబోయే బోర్డు సమావేశంలో చర్చిస్తామని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డిస్ వెల్లడించారు.
ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తాలిబన్ల చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచీ తాము పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఎలాంటి క్రికెట్ వ్యవహారాలు సాగడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఐసీసీలో పూర్తి స్థాయి సభ్య దేశంగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌కు ఇప్పటి వరకూ మహిళల టీమ్ లేదు. శనివారం నుంచి ప్రారంభం కాబోయే మహిళల అండర్ 19 టీ20వరల్డ్‌కప్‌లో టీమ్ లేని ఏకైక సభ్యదేశం ఆఫ్ఘనిస్థానే.
సంబంధిత కథనం