India at Paris Olympics: పతకాల ఆశలు అత్యధికంగా ఎవరిపై? యంగెస్ట్ ఎవరు?: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‍పై కీలక వివరాలు
26 July 2024, 18:07 IST
- India at Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ 2024 షురూ అయ్యాయి. గతం కంటే ఈసారి భారత్ ఎక్కువ పతకాలు దక్కించుకుంటుందనే ఆశలు ఉన్నాయి. ఈ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత అథ్లెట్ల బృందం గురించి కీలక వివరాలు ఇవే.
India at Paris Olympics: పతకాల ఆశలు అత్యధికంగా ఎవరిపై?
పారిస్ ఒలింపిక్స్ 2024 క్రీడా సమరం మొదలైంది. ఈ ప్రతిష్టాత్మక క్రీడా టోర్నీ ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతోంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలను కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌లో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ నమోదు చేసింది. అయితే, ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల్లో రెండంకెల మార్క్ సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. 117 మంది భారత అథ్లెట్లు ఈ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్నారు. పారిస్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత బృందానికి సంబంధించిన కీలక విషయాలు, పతకాల ఆశలు ఎవరిపై ఎక్కువ అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మొత్తంగా ఎంత మంది?
పారిస్ ఒలింపిక్స్‌లో 117 మంది భారత అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఇందులో 70 మంది పురుష ప్లేయర్లు, 47 మంది మహిళలు ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో 121 మంది ఆడారు. పారిస్ క్రీడలకు మహిళల హాకీ జట్టు అర్హత సాధించి ఉంటే టోక్యో మార్క్ దాటేది. పారిస్ ఒలింపిక్స్‌లో 117 మంది అథ్లెట్ల భారత బృందంలో 72 మందికి ఇవే తొలి ఒలింపిక్స్.
ఏఏ క్రీడల్లో..
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 16 క్రీడల్లో పోటీ పడుతోంది. ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో భారత అథ్లెట్లు తలపడనున్నారు.
ఎక్కువ మంది దేంట్లో
పారిస్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ తరఫున అథ్లెటిక్స్‌లో 29 మంది బరిలోకి దిగుతున్నారు. ఆ తర్వాత షూటింగ్‍లో 21 మంది పోటీల్లో ఉన్నారు.
ఎక్కువసార్లు ఒలింపిక్స్
టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్ ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన భారత అథ్లెట్‍గా ఉన్నారు. ఒలింపిక్స్ ఆడడం అతడికి ఇది ఐదోసారి. టెన్నిస్ సీనియర్ స్టార్ రోహన్ బోపన్న, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రా, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ తమ మూడో ఒలింపిక్స్ ఆడుతున్నారు.
పెద్ద, పిన్న వయస్కులు
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత అథ్లెట్ల బృందంలో 44 ఏళ్ల రోహన్ బోపన్న అత్యధిక వయస్కుడిగా ఉన్నాడు. 14 ఏళ్ల స్విమ్మర్ దినిధి దేసింఘు భారత బృందంలో అత్యంత పిన్న వయస్కురాలు (యంగెస్ట్)గా ఉన్నారు.
వీరిపై అత్యధికంగా పతక ఆశలు
పారిస్ ఒలింపిక్స్‌లో వీరు కచ్చితంగా పతకం సాధిస్తారనే అంచనాలు ఉన్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్‍లో సాత్విక్ సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి, మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‍లో పీవీ సింధు, భారత మహిళల ఆర్చరీ జట్టు, భారత పురుషుల ఆర్చరీ జట్టు, భారత పురుషుల హాకీ జట్టు, షూటింగ్‍లో సిఫ్త్ కౌర్ సామ్రా, షూటింగ్‍లో మనూ భాకర్, బాక్సింగ్‍లో నిఖత్ జరీన్, రెజ్లింగ్‍లో అంతిమ్ పంగల్‍లు మెడల్ సాధిస్తారనే ఆశలు అధికంగా నెలకొన్నాయి.
భారత ఒలింపిక్ పతకాల చరిత్ర
ఒలింపిక్స్ చరిత్రలో అన్ని ఎడిషన్లు కలిపి భారత్‍కు ఇప్పటి వరకు 35 పతకాలు వచ్చాయి. వీటిలో 12 టీమ్ స్పోర్ట్స్ నుంచి వచ్చాయి. దేశం తరఫున 134 మంది అథ్లెట్లు ఒలింపిక్ పతకం (వ్యక్తిగతంగా లేదా జట్టులో భాగంగా) కైవసం చేసుకున్నారు. వీరిలో 37 మంది టీమ్ స్పోర్ట్స్‌లో ఒకటి కంటే ఎక్కువ ఒలింపిక్ పతకాలు సాధించగా, ముగ్గురు వ్యక్తిగతంగా ఒకటి కంటే ఎక్కువగా పతకాలు సాధించారు.
ఒకటి కంటే ఎక్కువ మెడల్స్ సాధించిన వారు
ఒలింపిక్స్‌లో భారత్ తరఫున వ్యక్తిగతంగా ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన వారు ఇప్పటి వరకు ముగ్గురే ఉన్నారు. నార్మన్ ప్రిచర్డ్, సుశీల్ కుమార్, పీవీ సింధు మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నారు. పారిస్ క్రీడల్లో పతకం గెలిస్తే.. వ్యక్తిగత ఈవెంట్లలో మూడు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి భారత ప్లేయర్‌గా తెలుగమ్మాయి సింధు రికార్డు సృష్టిస్తారు.
గతంలో ఒలింపిక్ పతక విజేతలు
గతంలో ఒలింపిక్స్ పతకాలు సాధించిన నలుగురు అథ్లెట్లు, ఓ టీమ్.. పారిస్ ఒలింపిక్స్ భారత బృందంలో ఉన్నారు. గతంలో నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి చాను, లవ్లీనా బొర్గహైన్ ఒలింపిక్ పతకం గెలిచారు. పురుషుల హాకీ జట్టు కూడా మెడల్ సాధించింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 టోర్నీ జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయి. అయితే, జూలై 26న ఓపెనింగ్ సెర్మనీకి ముందే కొన్ని పోటీలు జూలై 25నే షురూ అయ్యాయి.